
ఎన్నికల ముందు పత్రికా ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఈసీఐ
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఉపఎన్నికల నేపథ్యంలో పత్రికల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు ఆరు రాష్ట్రాల్లో జరిగే ఉపఎన్నికల సందర్భంలో ఈ నిబంధన అమలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో పారదర్శకతను కాపాడటం, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కమిషన్ పేర్కొంది. పోలింగ్ రోజు లేదా పోలింగ్‌కు ముందు రోజు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించాలంటే వాటి విషయాన్ని ముందుగానే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ఆమోదించాలి.
అనుమతులు లేకుండా ప్రకటనలకు నో
రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో పనిచేసే ఈ కమిటీ నుంచి అనుమతి లేకుండా ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించరాదని స్పష్టం చేసింది. అభ్యర్థులు, వ్యక్తులు జిల్లా స్థాయి ఎంసీఎంసీ వద్ద అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో ఉన్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. కాబట్టి ఏప్రిల్ 8, 9 తేదీల్లో ప్రచురించే ప్రకటనలకు ముందస్తు ధృవీకరణ తప్పనిసరి. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ ఉండగా, ఏప్రిల్ 22, 23 తేదీల్లో వచ్చే ప్రకటనలకు ముందుగా అనుమతి తీసుకోవాలి. పశ్చిమబెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశకు ఏప్రిల్ 22–23 తేదీల్లో, రెండో దశకు ఏప్రిల్ 28–29 తేదీల్లో ప్రచురించే ప్రకటనలకు ముందస్తు ధృవీకరణ తప్పనిసరి. ప్రకటనలను ప్రచురించే తేదీకి కనీసం రెండు రోజుల ముందే ధృవీకరణ కోసం దరఖాస్తు చేయాలని కమిషన్ సూచించింది. నియమాల అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్రాలు, జిల్లాల్లో ఎంసీఎంసీ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ కమిటీలు ఎన్నికల సమయంలో చెల్లింపు వార్తలు (పెయిడ్ న్యూస్) వంటి అంశాలను కూడా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
యువ ఓటర్ల కోసం జెన్-జెడ్ మ్యూజిక్ వీడియో
కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఓటు వేయడానికి ప్రోత్సహించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా జెన్-జెడ్ శైలిలో మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో రతన్ యూ కేల్కర్, తిరువనంతపురం జిల్లా కలెక్టర్ అనుకుమారి కూడా పాల్గొన్నారు. వీరిలో అసిస్టెంట్ కలెక్టర్ శివశక్తివేల్ , ఎన్నికల విభాగం అండర్ సెక్రటరీ సరీన్ ఎస్.ఎస్., అలాగే బీఎల్‌ఓ సత్యభామతో పాటు అనఘ సజీకుమార్, మనసా ఆర్‌బి, దేవికా అనిల్, దీపా ఎల్, అనీష్ ఎంఎస్, అభిజిత్, అశ్విన్ తదితరులు కూడా ఈ వీడియోలో కనిపించారు. ఈ మ్యూజిక్ వీడియో లక్ష్యం యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచడం. ‘వియ్ ఓట్, వియ్ డిసైడ్’ అనే భావంతో రూపొందించిన ఈ పాటలో ప్రతి ఓటు ప్రభుత్వ ఏర్పాటుపై ఎంత ప్రభావం చూపుతుందో వివరించారు.
