
ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్ గూండాయిజం: కేటీఆర్
రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అల్లర్లు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల తీర్పు వచ్చి 24 గంటలు కూడా పూర్తికాకముందే కాంగ్రెస్ పార్టీ గుండాయిజం, రౌడీయిజం ప్రదర్శించడం దురదృష్టకరమని ఆయన ఆరోపించారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమ పదేండ్ల పాలనలో అనేక ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించినా ప్రతిపక్షాలపై ఎటువంటి దాడులకు పాల్పడలేదని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం తమ పార్టీ సంస్కృతి అని, ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని హింస చేయడం, దిగజారుడు చర్య అన్నారు.తమ పార్టీ కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరి భద్రత తమకు అత్యంత ముఖ్యమని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని, ఎప్పుడు ఆపద వచ్చిందన్నా పార్టీ తమతోనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్‌లో దాడికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన కేటీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్‌లో జరిగిన దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్‌ను శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ చేసిన విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. ఆయన, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మా కార్యకర్తపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను” అని పేర్కొన్నారు.
దాడికి కాంగ్రెస్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, దొంగ ఓట్లు వేసి, డబ్బులు పంచి, గూండాగిరితో కాంగ్రెస్ గెలుపును సాధించిందని వివరిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.ఎన్నికల తరువాత జరిగిన కాంగ్రెస్ విజయోత్సవ ఊరేగింపే వారి అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు.గతంలో మేము ఎన్నో ఉప ఎన్నికలు గెలిచాము. అప్పట్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాలేదు. అయినా ఆ పార్టీ గుర్తును గాడిద మీద వేసి ఊరేగించలేదేమో? అని ప్రశ్నించారు.రాజకీయ ప్రతిస్పర్థలు ఉన్నప్పటికీ శాంతి, సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వం, అధికార పార్టీ బాధ్యత అని కూడా ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు శాంతితో ఉండాలని, పరిస్థితిని గమనిస్తూ పార్టీ సూచనలు పాటించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
