
ఎన్నికల ప్రచార కమిటీ ప్రకటన
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీహార్‌లో బీజేపీ చకచకా కమిటీలను, ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ పోతోంది. ఇటీవల బీహార్ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని నియమించింది. ఆదివారం ఎన్నికల ప్రచార కమిటీ జాబితాను ప్రకటించింది. దీంతో ఎన్నికల సమరానికి మైదానాన్ని సిద్ధం చేసింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వడమే ఆలస్యం బీజేపీ కార్యక్షేత్రంలోకి దిగనుంది. ఇప్పటికే అస్త్ర, శస్త్రాలను, రథసారథులను ప్రకటించింది. తాజాగా ప్రచార పర్వంలో కీలకమైన నేతలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది. ఈ జాబితాలో దాదాపు 45 మంది చోటు దక్కించుకున్నారు.
ప్రతి ఇంటికి మోడీ ఆలోచనలు చేరాలి
కేంద్రమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార కమిటీ ప్రకటనకు ముందు రోజు సమస్తిపూర్ లో మిథిలా, తిర్హాట్, తదితర 12 సంస్థాగత జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీ సాధించాలంటే ప్రతి ఇంటికి ప్రధాని మోడీ ఆలోచనలు చేరాలని, ప్రధాని దార్శనికతను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ అట్టడుగు స్థాయి నుంచి ‘అభివృద్ధి చెందిన బీహార్’ నినాదంతో ముందుకుసాగడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
చొరబాటు దారులను తరిమికొడతాం
బీహార్‌లోకి చొరబడిన అక్రమ చొరబాటుదారులను తరిమికొడతామని, పవిత్ర భూమి అయిన ఈ ప్రాంతం నుంచి వారిని వెళ్లగొడతామని అరారియాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. వారిని ఇక్కడి నుంచి తరిమికొట్టాలంటే ఎన్డీయేను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీరు మాకు మళ్లీ అధికారం ఇవ్వండి. బీహార్ నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
తేజస్వీ యాదవ్‌ను సీఎం చేయడమే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏకైక లక్ష్యమని, కాంగ్రెస్ కూడా వీరి లక్ష్యంలో భాగమైందని విమర్శించారు. గతంలో యూపీఎ హయాంలో కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో ఆర్జేడీ సామూహిక అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. అనేక కుంభకోణాలు, మోసాలకు పాల్పడుతూ బీహార్‌ను సర్వం దోచుకున్నారన్నారు. 11 సంవత్సరాలుగా కేంద్రలో ఉన్న మోడీ ప్రభుత్వంపై వీరు కనీసం ఒక్క అవినీతి ఆరోపణ అయినా చేయగలిగారా? అని ప్రశ్నించారు. దీంతో దేశ భవిష్యత్ ను మార్చేది, ప్రజలకు ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించేది ఎవరో తెలుసుకోవాలని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
