Let's talk: editor@tmv.in
ఎన్నికల నగారాకు ముందు మమతా వరాల జల్లు

ఎన్నికల నగారాకు ముందు మమతా వరాల జల్లు

Panthagani Anusha
16 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కేవలం కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, మతపరమైన సేవకులు వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునేలా వరుసగా కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆమె వివరాలను వెల్లడిస్తూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చిరకాలంగా ఎదురుచూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) బకాయిల అంశంపై మమత కీలక హామీ ఇచ్చారు. కాగా మార్చి నుంచే ఈ బకాయిలను చెల్లించడం ప్రారంభిస్తామని ఆమె ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, విద్యాసంస్థల ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. రోపా-2009 నిబంధనల ప్రకారం ఉన్న బకాయిలను విడతల వారీగా చెల్లించనున్నట్లు దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

ఇక అధ్యాత్మిక రంగంలో సేవలు అందిస్తున్న పురోహితులు, ముయజ్జిన్ల పట్ల కూడా ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది. వారికి ప్రస్తుతం అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.500 మేర పెంచుతున్నట్లు మమత వెల్లడించారు. ఈ పెంపుతో వారు ఇప్పటివరకు పొందుతున్న మొత్తానికి అదనంగా నెలకు రూ.2,000 చెల్లించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలిపింది. ప్రతి సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఆధ్యాత్మిక సేవకులకు తగిన గుర్తింపు అందించడమే తమ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరో ఐదు కొత్త సాంస్కృతిక మరియు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ముండా, కోరా, డోమ్, కుంభకార్, సద్గోపే సముదాయాల కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ బోర్డులు ఆయా సముదాయాల ప్రత్యేక భాషలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు వారికి మెరుగైన విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తాయని ఆమె పేర్కొన్నారు.

అయితే “మా, మట్టి, మనుష్” సిద్ధాంతంతో రాష్ట్రంలోని ప్రతి సమాజం అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని 2013 నుంచి అట్టడుగు వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం అనేక బోర్డులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. సమగ్ర అభివృద్ధి ద్వారానే ప్రతి కుటుంబానికి సంతోషం చేకూర్చాలనేది ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. కాగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందే ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.