
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్: తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి తాత్కాలిక బ్రేక్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా విరామం పడింది. ఈ నెల 19వ తేదీ నుంచి మొదలైన చీరల పంపిణీ, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 25 సాయంత్రం నుంచి నిలిపివేశారు.
ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 19 నుంచి 25 వరకు కేవలం వారం రోజుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 44 లక్షల చీరల పంపిణీ చేశారు. అదే రోజు పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో చీరల పంపిణీ ఆపి వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో సుమారు మరో 11 లక్షల చీరలుఇవ్వాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అర్హులైన మహిళలందరికీ చీరలు పంపిణీ చేయనున్నట్లు సెర్ప్ సీఈఓ దివ్య తెలిపారు. చీరాల పంపిణీతో గ్రామాల్లో సుమారు 2 లక్షల మంది కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారు.
నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8వ తేదీ వరకు సుమారు 35 లక్షల మందికి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా పంపిణీ చేయడం ద్వారా ఈ పథకానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలై, రాష్ట్రమంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం మూడు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత డిసెంబర్ 17న జరగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ పూర్తై, పరిశీలన జరుగుతోంది. నామినేషన్ల తిరస్కరణపై అభ్యర్థులు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంది. ఉపసంహరణ గడువు తర్వాతే సర్పంచ్/వార్డు మెంబర్ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు, బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
