
ఎన్నికల్లో హింసకు తావులేదు:సీఈసీ జ్ఞానేశ్‌కుమార్
బీహార్ ఎన్నికల్లో ఒక్క చుక్క రక్తపాతాన్ని కూడా సహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ బీహార్ ప్రజలు స్వేచ్ఛాయుతంగా, ఎటువంటి భయలేకుండా ఓటు వేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్తెలిపారు. మొకామాలో రాజకీయ హత్య జరిగిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నామని అన్నారు.
హింసకు పాల్పడితే సహించేలేదని ఎన్నికల సంఘం తెలిపింది. అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎలాంటి హింసాత్మక చర్యలను సహించం అని ఆయన స్పష్టం చేశారు. బీహార్‌లోని 243 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఆబ్జర్వర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ ఆబ్జర్వర్లు అందరూ సిద్ధంగా ఉన్నారని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ పేర్కొన్నారు.
సంచలనం సృష్టించిన మొకామా హత్య
అక్టోబర్ 30న మొకామా అసెంబ్లీ నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శిని నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న రాజకీయ నాయకుడు దులర్ చంద్ యాదవ్ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యకు సంబంధించి జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మొకామా నియోజకవర్గం ఈసారి హాట్‌సీట్‌గా మారింది. జేడీయూ తరఫున అనంత్‌సింగ్ పోటీ చేస్తుండగా, ఆర్‌జేడీ నుంచి మాజీ ఎంపీ సురజ్భాన్‌సింగ్ భార్య వీణాదేవి రంగంలోకి దిగారు. ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన పోరు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
హత్య ఘటనపై ఎన్నికల సంఘం అత్యవసరంగా జోక్యం చేసుకుని కీలక అధికారుల బదిలీలు చేపట్టింది. బర్హ్ ఎస్డీవో–కమ్ రిటర్నింగ్ ఆఫీసర్ చందన్‌కుమార్, ఎస్డీపీవోలు రాకేష్‌కుమార్, అభిషేక్‌సింగ్‌లను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే, బీహార్ డీజీపీ నుంచి పూర్తి నివేదిక ఇవ్వాలని డైరెక్షన్ జారీ చేసింది.
తటస్థతే మా బలం: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్
ఎన్నికలలో తటస్థతపై వస్తున్న విమర్శలకు ఆయన స్పందిస్తూ ఎన్నికల సంఘానికి ఎవరూ అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కాదు. మాకు అందరూ సమానమే. మా విధానం పూర్తిగా తటస్థం అని స్పష్టం చేశారు. బీహార్ లో మొదటి దశ ఓటింగ్ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న, లెక్కింపు నవంబర్ 14న జరుగుతుందని తెలిపారు.
ప్రపంచానికి ఆదర్శంగా బీహార్ ఎన్నికలు
ఎన్నికలను పారదర్శకంగా, నైపుణ్యంతో, సులభంగా నిర్వహించడం ఎన్నికల సంఘం లక్ష్యమని జ్ఞానేశ్‌కుమార్ పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలు దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ఆదర్శంగా నిలవాలి. ప్రతి ఓటరు తమ ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలపరచాల అని ఆయన పిలుపునిచ్చారు.
ఐఐటీ కాన్పూర్ నుంచి డిస్టింగ్విష్డ్ అవార్డు
కాన్పూర్‌లో పర్యటిస్తున్న జ్ఞానేశ్‌కుమార్ తన ఆల్మా మేటర్ ఐఐటీ కాన్పూర్ ను సందర్శించారు. ఆ సంస్థ తనకు అత్యున్నత గౌరవమైన ‘డిస్టింగ్విష్డ్ అల్యుమ్నీ అవార్డు(అత్యుత్తమ పూర్వ విద్యార్థి పురస్కారం) (డీఏఏ)’ ను ప్రదానం చేసింది. ఇక్కడ గడిపిన నాలుగేళ్లు నా జీవితంలో అత్యుత్తమమైనవి. మళ్లీ ఈ నగరానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థిగా తను అక్కడ గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఓటు వేయడం ప్రజాస్వామ్య పండుగలో భాగం. హింసరహితంగా, స్వేచ్ఛాయుతంగా జరగబోయే ఈ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచానికి చాటుతాయి.
