
ఎన్నికల్లో ‘ఉచిత’ హామీలపై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చే ‘ఉచిత హామీల’పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) వచ్చే మార్చి నెలలో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇలాంటి హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తులు, వాటి రిజిస్ట్రేషన్‌లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.
సూర్య చంద్రులు తప్ప అన్నీ హామీ ఇస్తున్నారు!
పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. "ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సూర్యచంద్రులను తప్ప మిగిలినవన్నీ ఇస్తామని హామీలిస్తున్నాయి. ఇది ఓటర్లను ప్రలోభపెట్టే అవినీతి చర్య కిందికే వస్తుంది" అని పేర్కొన్నారు. 2022లోనే ఈ విషయంలో కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశామని, కేసును త్వరగా విచారించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం.. "ఇది చాలా ముఖ్యమైన అంశం.. మార్చిలో విచారణ జరుపుతాం" అని స్పష్టం చేసింది.
బడ్జెట్‌ను మించిన ఉచితాల భారం
గతంలో 2022 జనవరిలో అప్పటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. "కొన్నిసార్లు ఉచితాల బడ్జెట్ అసలు బడ్జెట్ పరిమితులను మించిపోతోంది" అని వ్యాఖ్యానించింది. ప్రజాధనంతో ప్రలోభపెట్టడం వల్ల ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని, రాజకీయ పార్టీల మధ్య సమాన పోటీతత్వం లోపిస్తుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
గుర్తింపు రద్దు చేయాలనే డిమాండ్
ఎన్నికల గుర్తుల కేటాయింపు నిబంధనల్లో కీలక మార్పులు చేయాలని కోరిన పిటిషనర్, ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ వస్తువులను, సేవలను పంచుతామని హామీ ఇచ్చే పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఓటర్లకు లంచాల రూపంలో ఉచితాలు ప్రకటించడం రాజ్యాంగంలోని 14, 162, 266(3), 282 అధికరణలను ఉల్లంఘించడమేనని, ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేవలం అధికారంలోకి రావడం కోసమే ప్రజాధనంతో ఓటర్లకు గాలం వేయడం ప్రజాస్వామ్య విలువల మనుగడకే పెను ముప్పు అని ఆయన హెచ్చరించారు. ఈ అసంబద్ధ ఉచితాల ధోరణిని అరికట్టేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
ప్రజాస్వామ్య విలువలకే ముప్పు
ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలస్తంభాలని, కానీ ఇటీవల డబ్బు పంపిణీ, ఉచిత హామీలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని పిటిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులను వెచ్చించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. మార్చిలో జరగబోయే ఈ విచారణపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
