
ఎన్నికలకు ముందు ‘సర్’ కుట్ర: సీఎం మమతా బెనర్జీ
2026 అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు ఎన్నికల కమిషన్ ప్రారంభించిన ఎస్ఐఆర్ ప్రక్రియను ‘రాజకీయ కుట్ర’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బుధవారం మాల్దా జిల్లా గజోల్‌లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) భారీ వ్యతిరేక ర్యాలీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్ఐఆర్ వెనుక అమిత్ షా ఉన్నారు. బెంగాల్‌ను ఏదో ఒకటి చేసి స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరిక. కానీ ఈ తొందరపాటు ప్రక్రియ వల్ల బీజేపీ తన సొంత సమాధిని తవ్వుకుంది. బెంగాల్, బీహార్ ఒకటి కాదు. ఇక్కడ కుయుక్తులతో, మోసంతో గెలవలేరని మమతా ధ్వజమెత్తారు. ఎస్ఐఆర్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా భయాందోళన వ్యాపించిందని, ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించేస్తారనే భయంతో ఇప్పటివరకు 39 మంది సామాన్య ప్రజలు (వీరిలో నలుగురు బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఉన్నారు) మరణించారని, వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె తెలిపారు. వీరి కుటుంబాలకు మేం సాయం చేస్తున్నాం. ఇలాంటి బాధలు కొనసాగనివ్వమని హామీ ఇచ్చారు.
డిసెంబర్ 12 నుంచి ప్రత్యేక శిబిరాలు
ఎస్ఐఆర్, జనాభా గణనలకు తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం లేదని, కానీ రాజకీయ ఉద్దేశంతో ఈ తొందరపాటు ఎందుకు అని ప్రశ్నించారు. దేశ పౌరుడు మళ్లీ తాను ఈ దేశ పౌరుడినని నిరూపించుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘మే ఐ హెల్ప్ యూ’ శిబిరాలు పెడతామని, ప్రజలకు ఫారాలు నింపడంలో, విచారణలకు హాజరయ్యేందుకు సహాయం అందిస్తామని ప్రకటించారు. ప్రవాస బెంగాలీ కార్మికులు తప్పనిసరిగా ఫారాలు సమర్పించాలని, లేకుంటే పేరు తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు.
బీజేపీ బల్లెం పురుగుల్లాంటిది
మాకు హిందుత్వం నేర్పాల్సిన అవసరం లేదు. నేను మత సామరస్యం పాటిస్తాను. బీజేపీ బెడ్ బగ్స్ (బల్లెం పురుగులు) లాంటిది. తీసివేయకపోతే కొరుకుతూనే ఉంటుంది. బెంగాల్ ను కాపాడాలంటే వారిని రాజకీయంగా తొలగించాలని సూచించారు. నేను ఉన్నంత వరకు ఒక్క బెంగాలీని కూడా డిటెన్షన్ క్యాంపుకో, తిరిగి బంగ్లాదేశ్‌కో పంపనివ్వను అని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఈ ఎస్ఐఆర్ ద్వారా బెంగాలీ మైనారిటీలను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన మమతా, తాను ఓట్లు అడగడానికి కాకుండా, భయపడుతున్న ప్రజల పక్షంలో నిలబడడానికే మాల్దాకు వచ్చానని చెప్పారు. ఎవరూ డిటెన్షన్ క్యాంపుకు వెళ్లరు, మీ పేరు తొలగించరు. బెంగాల్ సురక్షితంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కేంద్రం నిధులను అడ్డుకుంటోంది
కేంద్రం పశ్చిమ బెంగాల్‌కు రావలసిన రూ.1.87 లక్షల కోట్ల నిధులను రాకుండా అడ్డుకుంటోందని, ఇప్పుడు సిగరెట్ మీద వేసే పన్నులు కూడా తీసేసుకుంటారని విమర్శించారు.
గర్భిణి సోనాలీ ఖాతూన్ కేసును ప్రస్తావించిన మమతా, బుధవారం సుప్రీం కోర్టు మానవతా ఆధారంగా ఆమెను, ఆమె ఎనిమిదేళ్ల బిడ్డను తిరిగి భారత్‌లోకి అనుమతించిందని గుర్తు చేశారు. బీఎస్ఎఫ్ ఆమెను బలవంతంగా బంగ్లాదేశ్‌లోకి తోసేసింది ఎందుకు? ఆమె బెంగాలీ అన్న కారణంతోనా? అని ప్రశ్నించారు.
