Let's talk: editor@tmv.in
ఎన్నికలకు ముందు.. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి దారుణ హత్య

ఎన్నికలకు ముందు.. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి దారుణ హత్య

Shaik Mohammad Shaffee
11 ఫిబ్రవరి, 2026

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మైమన్ సింగ్ జిల్లాలోని త్రిషాల్‌లో సుసేన్ చంద్ర సర్కార్ (62) అనే హిందూ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బోగర్ బజార్ జంక్షన్‌లోని ‘భాయ్ భాయ్ ఎంటర్‌ప్రైజెస్’ అనే దుకాణంలో సుసేన్ ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

హత్య చేసి.. షట్టర్లు వేసి..!

స్థానిక పోలీసు అధికారి మహమ్మద్ ఫిరోజ్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు పదునైన ఆయుధాలతో సుసేన్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం రక్తపు మడుగులో ఉన్న ఆయన్ని దుకాణం లోపలే వదిలేసి, బయట నుంచి షట్టర్లు మూసి పరారయ్యారు. రాత్రి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలిస్తూ వచ్చి, షట్టరు తీసి చూడగా సుసేన్ విగతజీవిగా పడి ఉన్నారు. వెంటనే ఆయన్ని మైమన్ సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

లూటీ కోసమేనా? రాజకీయ కుట్రలా?

చాలా కాలంగా తాము బియ్యం వ్యాపారం చేస్తున్నామని, ఎవరితోనూ తమకు శత్రుత్వం లేదని మృతుడి కుమారుడు సుజన్ సర్కార్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని చంపిన తర్వాత దుకాణంలోని లక్షలాది రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారని ఆయన తెలిపారు. నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హత్య కలకలం రేపుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హిందువులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

మైనారిటీలపై పెరుగుతున్న హింస

బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య మండలి గణాంకాల ప్రకారం.. గతేడాది డిసెంబర్‌లో రాడికల్ యువజన నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత మైనారిటీలపై దాడులు తీవ్రమయ్యాయి. కేవలం డిసెంబర్ 2025 నెలలోనే 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని కౌన్సిల్ పేర్కొంది. 2022 జనగణన ప్రకారం బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా సుమారు 1.31 కోట్లు (7.95 శాతం) ఉండగా, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత వారి భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది.