
ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం 15వ వార్షికోత్సవం: కేసీఆర్‌ను కలిసిన నాయకులు
ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం 15వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూకే విభాగ అధ్యక్షుడు నవీన్ రెడ్డి నేతృత్వంలో బృందం, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలిశారు. మొదట, కేటీఆర్ కేక్ కట్ చేసి యూకే విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీకి ఎల్లప్పుడూ అంకితభావంతో, సమర్థంగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
అనంతరం, నవీన్ రెడ్డి బృందం కేసీఆర్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి ఆశీర్వాదం పొందింది. లండన్ వేదికగా చేసిన ఉద్యమ కాలపు పోరాటాన్ని గుర్తుచేస్తూ, పార్టీ గొంతుగా నిరంతరం పనిచేయాలని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజలకు అండగా, ప్రభుత్వం పై పోరాటాన్ని కొనసాగిస్తూ, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు సమర్థంగా పని చేయాలని వారికి భరోసా ఇచ్చారు.
నవీన్ రెడ్డి, కార్యవర్గం తరపున కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడో మైళ్ల దూరంలో ఉన్నా, గులాబీ జెండా మోసి వారి నాయకత్వంలో పనిచేయగల అవకాశం పొందినందుకు ఎప్పటికీ కృతజ్ఞతలు అని తెలిపారు. 15 సంవత్సరాలుగా యూకే విభాగాన్ని ప్రోత్సహించిన అన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు, ప్రాంతీయ సంఘాలు, ప్రవాస సంస్థలు, మీడియా ప్రతినిధులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
