Let's talk: editor@tmv.in
ఎన్డీయేలో చిరా(గ్)కు!

ఎన్డీయేలో చిరా(గ్)కు!

Pinjari Chand
9 అక్టోబర్, 2025

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు సీట్లపై ముమ్మర కసరత్తులు ప్రారంభించాయి. ప్రతి కూటమిలో ప్రస్తుతం సీట్ల కేటాయింపులపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కూటములలోని పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారాయి. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి? నియోజకవర్గాల్లో వారి బలమెంత? తదితర అంశాల ఆధారంగా ఆయా పార్టీలు తమకు ఇన్ని స్థానాలు కావాలని పట్టుబడుతున్నాయి. లేకుంటే ఒంటరిగా ముందుకు వెళతామనే సంకేతాలిస్తున్నాయి. అటువంటి పంథానే ఇప్పుడు లోక్ జనశక్తి(రామ్ విలాస్​ పాశ్వాన్) పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ అనుసరిస్తున్నారు. చిరాగ్ పాశ్వాన్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు బీహార్ రాజకీయాల్లో మంచి పట్టుంది. 2000 సంవత్సరంలో పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రస్తుత ఎన్నికల వరకు ఉత్తమ ఫలితాలను సాధించలేకపోయింది. దళిత సామాజిక వర్గాల్లో మంచి పేరున్న రామ్ విలాస్ పాశ్వాన్ 2019 వరకు లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అసెంబ్లీ స్థానాలు గెలిచే విషయంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలను నమోదు చేయలేదు. 2020 శాసనసభ ఎన్నికల్లోనే 5 సీట్లు గెలిచారు.

40 స్థానాలు ఇవ్వాల్సిందే

2020 ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ జేడీయూకు వ్యతిరేకంగా 143 స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. అయితే గెలిచింది 5 స్థానాలే అయినా ఎక్కువగా కూటమికి నష్టం చేశారు. ఈ సారి అటువంటి నష్టం వాటిల్లకుండా బీజేపీ ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్​ ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల చిరాగ్ ను కలిశారు. ఈ సమావేశంలో సీట్ల అంశం చర్చకు వచ్చినట్లు, చిరాగ్ అడిగిన సీట్లు ఇవ్వడానికి కూటమి సిద్ధంగా లేనట్లు సంకేతాలు వచ్చాయి. 2025 ఎన్నికల్లో తాము ఎన్డీయే కూటమిలో ఉండాలంటే సుమారు 40 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలని మొండిపట్టుపడుతున్నారు. దీంతో కూటమిలో విబేధాలు పొడచూపాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఎన్డీయేలో తమ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో అసెంబ్లీ స్థానాలను కేటాయించకుంటే చిరాగ్ ఎటువైపు పయనిస్తారు? ఒంటరిగా ముందుకు వెళతారా? కొత్తగా వచ్చిన పార్టీ జన్ సురాజ్ తో కలిసి అడుగులు వేస్తారా ? అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయాలను గమనించే వారిలో ఉత్కంఠ నెలకొంది.

పీకేతో కలిసి నడుస్తారా?

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. రాజకీయ విశ్లేషకుల దృష్టి ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్​ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (పీకే)పైనే ఉంది. ఇప్పటికే పీకే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్రను పూర్తిచేసి ప్రజా ఆశీర్వాదం పొందారు. రాష్ట్రంలోని సాధకబాధాకాలు తెలిసిన వ్యక్తి. అన్ని అంశాల్లో మెరుగైన విషయావగహాన కలిగిన నేతగా ప్రస్తుతం ప్రజల మస్తిష్కంలో నిలిచారు. ఈయన తో చిరాగ్ పాశ్వాన్ జతకట్టే అవకాశాలున్నాయనే పుకార్లు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

ఒంటరిగా వెళతారా

బీహార్​‌లో అసెంబ్లీ స్థానాలు మొత్తం 243 ఉన్నాయి. చిరాగ్ పాశ్వాన్ గత శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా 143 స్థానాల్లో పోటీ చేశారు. చేసినప్పటికీ ఐదు స్థానాల్లో మాత్రమే ఫలితాలను రాబట్టారు. మిగతా స్థానాల్లో జేడీయూ ఓట్లకు గండికొట్టారు. మెజార్టీ స్థానాలు రాకుండా చిరాగ్ అడ్డుపడ్డాడన్న కోపం జేడీయూకి ఇప్పటికీ ఉంది. మరి ఈసారి ఒంటరిగా పోటీ చేస్తారా అంటే ఆయన బుధవారం చేసిన వ్యాఖ్యలు తొసిపుచ్చలేని విధంగా ఉన్నాయి. చిరాగ్ పాశ్వాన్ తండ్రి దివంగత నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ తండ్రి వర్థంతి సందర్భంగా ఆయన‘ బీహార్ మా మొదటి ప్రాధాన్యం. బీహారినే మా మొదటి ప్రాధాన్యత అని మాట్లాడారు. తన తండ్రి తన భుజాలపై మోపిన బాధ్యతను తాను సాకారం చేస్తానని, అందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ మాటలు ఎన్డీయే కూటమిలో కలవరానికి గురి చేస్తున్నాయి. గత ఎన్నికల్లోనే లోక్ జనశక్తి వల్ల జేడీయూ నష్టపోయింది. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జేడీయూ, బీజేపీ చిరాగ్ ప్రవర్తనతో సందిగ్థంలో పడింది. చేతులారా ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి అస్త్రాలు అందించడానికి సిద్ధంగా లేదు.

చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయేకు దూరం కాకపోవచ్చు. 2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఐదు సీట్లు గెలిచింది. దీంతో చిరాగ్ పాశ్వాన్‌కు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే చిరాగ్ కూడా మోడీకి కూడా వీర విధేయుడు. అలాంటి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఆయన ఎన్డీయేను వీడడం చేతులారా భవిష్యత్‌ను చెడగొట్టుకోవడమే. రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తరువాత పార్టీ అనేక ఒడిదుడుకులకు లోనయ్యింది. చిన్నాన్న పశుపతినాథ్ పారాస్ పార్టీని రెండుగా చీల్చి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీని ఏర్పాటు చేసుకోవడంతో క్రమంగా లోక్ జనశక్తి పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ప్రస్తుతం చిరాగ్ పార్టీని పటిష్టం చేయాలని, దళిత సామాజికి వర్గానికి చెందిన ఓటు బ్యాంకును కాపాడుకోవాలని ప్రయత్నించే అవకాశాలను కూడా తీసిపారవేయలేం. ఇప్పటి వరకు జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్‌తో ఎటువంటి సమావేశం కాలేదు. తదుపరి ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామన్న సంకేతాలను చిరాగ్ ఇవ్వలేదు. కానీ ఒంటరిగా పోరాడే విషయంలో మాత్రం చిరాగ్ చర్యలను కాదనలేం.

ఎన్డీయేలో చిరా(గ్)కు! - Tholi Paluku