
ఎన్డీఏ విజయం కార్యకర్తల కృషి ఫలం: కేంద్రమంత్రి బండి
బీహార్ ప్రజలు 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏకు ఘనమైన మద్దతు ప్రకటించారు. ఈ తీర్పు దేశ నాయకత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి మరోసారి నిదర్శనమని తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహాత్మక మార్గదర్శకత్వం, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా నాయకత్వంలో పార్టీ సాధించిన సంఘటనా బలం ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి బండి వెల్లడించారు.
బీహార్‌లో ఎన్టీఏ సాధించిన భారీ విజయాన్ని ప్రజలు “స్థిరమైన పాలన”, “కనిపించే అభివృద్ధి”అవకాశాలను విస్తరించే రాజకీయాలు అనే అంశాలకు ఇచ్చిన తీర్పుగా బండి విశ్లేషించారు.ప్రాంతీయ, వర్గపరమైన విభజనలకు బదులుగా ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిని కేంద్ర బిందువుగా చేసుకున్న ఎన్డీఏ విధానాలు ఓటర్ల మనసులను గెలుచుకున్నాయని ఆయన అన్నారు.ఈ ఎన్నికల్లో చారిత్రక తీర్పు ఇచ్చినందుకు బీహార్ ప్రజలకు అభినందనలు తెలిపారు.
కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు:
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎన్డీఏ, బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. "బూత్ స్థాయిలో మీరు నెలల తరబడి చేసిన కృషి, మా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు చూపిన స్పష్టత, తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడంలో మీరు చూపిన ఓర్పు ఈ విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయని బండి కొనియాడారు.బీహార్‌లో ఎన్డీఏకు లభించిన ఈ స్పష్టమైన మెజారిటీ, అభివృద్ధి సుస్థిరత వైపు ప్రజల మొగ్గును మరోసారి బలంగా చాటిందని మంత్రి బండి అన్నారు.
