
ఎన్డీఏ చారిత్రక గెలుపు తరువాత నితీష్ నివాసంలో జేడీయూ నేతల కీలక భేటీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో, జనతాదళ్ (జేడీయూ) పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), సంజయ్ ఝా, శనివారం పాట్నాలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తదుపరి వ్యూహాలపై చర్చించడానికి ఈ భేటీ జరిగింది.
243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో జరిగిన ఎన్నికలలో,ఎన్డీఏ కూటమి 202 సీట్లను గెలుచుకుని, భారీ విజయాన్ని (మూడు-వంతుల మెజారిటీని) సాధించింది. ప్రత్యర్థి మహాఘట్‌బంధన్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది.2010 తర్వాత ఎన్డీఏ మరోసారి 200 మార్క్ దాటి ఇలాంటి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
సంజయ్ ఝా మాట్లాడుతూ, ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని, ముఖ్యంగా రాబోయే ఐదేళ్లు రాష్ట్రంలోని యువతకు అంకితం చేయబడతాయని నొక్కి చెప్పారు. "మాకు భారీ తీర్పు వచ్చింది. మొత్తం ఎన్డీఏ, జేడీయూ ఈ తీర్పును ఎంతో అణకువతో అంగీకరిస్తున్నాయని మా నాయకుడు ఎన్డీఏ మొత్తం మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక కోటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల హామీలను నెరవేరుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లో పెట్టుబడులు పెట్టాలని దేశంలోని పెట్టుబడిదారులను పిలుపునివ్వడం రాష్ట్రానికి గౌరవకారణమని ఆయన అన్నారు. “గత 20 ఏళ్లలో నితీష్ కుమార్ బిహార్‌కు బలమైన పునాది వేశారు. ఇప్పుడు ఒక పెద్ద దూకుడు అవసరం. రాబోయే అయిదేళ్లలో బిహార్ దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లో నిలుస్తుంది,” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఎన్డీఏ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని పాట్నాలోని బీజేపీ కార్యాలయం వెలుపల ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను చిత్రీకరిస్తూ "టైగర్ అభి జిందా హై" అనే చిత్రాలతో ఏర్పాటు చేసి కార్యకర్తలు సంబరాలు జరిపారు.
విభాగాల వారీగా చూస్తే
భాజపా 89 స్థానాలు, జేడీయూ 85, లోక్‌జనశక్తి పార్టీ (రాం విలాస్) 19, హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 5, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 స్థానాలు గెలుచుకున్నాయి.
విపక్ష పక్షాలైన ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ 2, ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ (IIP) 1, సిపిఐ(ఎం) 1 స్థానాలు గెలుచుకున్నాయి. మజ్లిస్ 5, బీఎస్పీ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి.నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించగా, బిహార్ 67.13 శాతం ఓటింగ్‌తో చరిత్ర సృష్టించింది. 1951 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా మహిళా ఓటర్లు 71.6శాతంతో పురుషులను (62.8శాతం) అధిగమించారు.
