Let's talk: editor@tmv.in
ఎన్‌టీఆర్ 30వ వర్ధంతి…ఘన నివాళులు

ఎన్‌టీఆర్ 30వ వర్ధంతి…ఘన నివాళులు

Panthagani Anusha
19 జనవరి, 2026

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి వేడుకలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటాయి. వెండితెరపై దైవంగా, రాజకీయాల్లో పేదల పెన్నిధిగా వెలిగిన ఆ మహనీయుడికి నివాళులర్పించేందుకు తెలుగు ప్రజలు తరలివచ్చారు. పల్లె నుండి పట్నం వరకు ఆయన విగ్రహాలను పూలమాలలతో అలంకరించి అన్నగారు చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తన తండ్రి శారీరకంగా దూరమైనా, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆకాంక్షించారు. ఆయన కేవలం సినిమాలను మాత్రమే కాకుండా ప్రజల హృదయాలను కూడా ఏలారని ప్రతికూల పాత్రల్లోనూ తన ప్రతిభను చాటిన అరుదైన నటుడని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయనే: పురందేశ్వరి

మరోవైపు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తన తండ్రికి అంజలి ఘటిస్తూ.. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయాల స్వరూపమే మారిపోయిందని గుర్తుచేశారు. రాజకీయాలు అంటే కేవలం అధికారం కాదని ఇది నిరుపేదలకు సేవ చేసే వేదిక అని ఆయన నిరూపించారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమలు చేసిన రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి విప్లవాత్మక నిర్ణయాలు నేటికీ దేశవ్యాప్త సంక్షేమ పథకాలకు పునాదులుగా నిలిచాయని ఆమె పేర్కొన్నారు.

తెలుగు ఆత్మగౌరవ ధ్రువతార: ముఖ్యమంత్రి చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని తరతరాల చరిత్రను తిరగరాసిన వీరపురుషుడని వర్ణించారు. సినీ ఆకాశంలో ధ్రువతారగా, రాజకీయ క్షేత్రంలో అజేయ యోధుడిగా నిలిచిన ఆయన, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. ప్రతి తెలుగువాడు ఉదయాన్నే స్మరించదగిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానం అజరామరమైనది. సుమారు 300 చిత్రాల్లో నటించిన ఆయన, పౌరాణిక పాత్రల ద్వారా కోట్లాది మంది ఆరాధ్య దైవంగా మారారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన తన ముద్ర వేశారు. 'తోడు దొంగలు', 'సీతారామ కళ్యాణం', 'వరకట్నం' వంటి చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకోగా, 'రాజు పేద', 'లవకుశ' చిత్రాల్లోని నటనకు అప్పటి రాష్ట్రపతి అవార్డులను కైవసం చేసుకున్నారు. 1996 జనవరి 18న ఆయన కన్నుమూసినప్పటికీ ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఆశయాలు నేటికీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు రాజకీయ నాయకులూ సైతం నివాళులర్పించారు.