Let's talk: editor@tmv.in
ఎన్ఐఎస్–పటియాలాను జాతీయ క్రీడా అకాడమీగా మార్చలేం: టాస్క్‌ఫోర్స్

ఎన్ఐఎస్–పటియాలాను జాతీయ క్రీడా అకాడమీగా మార్చలేం: టాస్క్‌ఫోర్స్

Pinjari Chand
31 డిసెంబర్, 2025

పటియాలాలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్) సెంటర్ ను క్రీడా నిర్వాహకుల శిక్షణ కోసం జాతీయ క్రీడా అకాడమీగా మార్చాలన్న ప్రతిపాదనను, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ తిరస్కరించింది. ఈ ప్రణాళిక పరిమితమైనదీ, దీర్ఘకాలికంగా నిలబడలేనిదీ అని మంగళవారం కమిటీ స్పష్టం చేసింది.

2008 ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అబినవ్‌ బింద్రా అధ్యక్షతన ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్, భారత క్రీడల భవిష్యత్‌కు అనుకూలమైన, స్థిరమైన, వృత్తిపరమైన పాలన వ్యవస్థను రూపకల్పన చేయాల్సిన బాధ్యతను తీసుకుంది. అదే క్రమంలో ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌లో క్రీడా నిర్వాహకుల సామర్థ్యాభివృద్ధికి ప్రత్యేక జాతీయ అకాడమీ స్థాపన సాధ్యతను కూడా పరిశీలించింది.అయితే ఒకే జాతీయ అకాడమీగా ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ను నిర్ణయించడం వల్ల అనవసర ప్రత్యేకాధికారం ఏర్పడి, ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థల ఎదుగుదల ఆపబడే ప్రమాదముందని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పీఎస్‌యూలు ఎక్కువగా ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌లో శిక్షణ పొందిన కోచ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నాయని, దీంతో ఇతర విశ్వసనీయ సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థులకు అవకాశాలు తగ్గుతున్నాయని టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. అంతర్జాతీయంగా సర్టిఫికేషన్ పొందిన కోచ్‌లు కూడా కొన్ని సందర్భాల్లో అర్హులుగా పరిగణించలేకపోవడం ఆందోళనకరమని తెలిపింది.

మోనోపోలీ సముచితం కాదు

ఈ పరిస్థితి క్రీడా పాలన రంగంలోనూ పునరావృతమైతే, అది ఏకాధిపత్యం (మోనోపోలీ)గా మారుతుందని హెచ్చరించింది. భారత్‌ వంటి విస్తృతమైన, వైవిధ్యభరిత దేశంలో ఒకే సంస్థపై ఆధారపడటం సముచితం కాదని పేర్కొంది. దీనికి బదులుగా, ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ను క్రీడా నిర్వాహకుల శిక్షణ మాడ్యూల్స్ అందించే ముఖ్యమైన సంస్థల నెట్‌వర్క్‌లో ఒక భాగంగా ‘ఎంపానెల్’ చేయాలని సిఫార్సు చేసింది. ఇలా చేయడం వల్ల వనరుల సమర్థ వినియోగం, ప్రాంతీయ ప్రాప్తి, సమగ్రత పెరుగుతాయని వివరించింది. ఈ నివేదికపై స్పందించిన క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయా, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌లో కోర్సు నిర్మాణాన్ని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు.

ఎన్ఐఎస్–పటియాలాను జాతీయ క్రీడా అకాడమీగా మార్చలేం: టాస్క్‌ఫోర్స్ - Tholi Paluku