
ఎన్‌ఈపీ–2020 రూపకల్పనలో విద్యా భారత కీలక సూచిక: ధర్మేంద్ర ప్రధాన్
జాతీయ విద్యా విధానం–2020 రూపకల్పనలో విద్యాభారతి కీలక సూచికగా నిలిచిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యా భారతి అమలు చేస్తున్న పలు పద్ధతులు ఇప్పుడు జాతీయ పాఠ్య ప్రణాళికలో భాగమయ్యాయని ఆయన అన్నారు. కొత్త విద్యా సంవత్సర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ విద్యా వ్యవస్థలో విద్యా భారతి వాటా కేవలం ఒక శాతం మాత్రమే అయినప్పటికీ, అది అమృత బిందువులాంటిదని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా విద్యా శాఖతో తనకు అనుబంధం ఉందని పేర్కొన్న ప్రధాన్, పాఠ్యపుస్తకాలు, బోధనా భాష, విద్యా విధానాలు, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే సమయంలో విద్యా భారతి అనుభవాలను తరచుగా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రూపకల్పనకు విద్యా భారతి కూడా ప్రేరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
మాతృభాషలో బోధన వల్ల సృజనాత్మకత పెరుగుతుంది
విద్యా భారతి చాలా కాలంగా అమలు చేస్తున్న ‘బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్’, మాతృభాష ఆధారిత బోధన, ఉపాధ్యాయుల నిరంతర శిక్షణ వంటి పద్ధతులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని ప్రధాన్ తెలిపారు. ఎన్‌ఈపీ ప్రకారం పాఠశాలల్లో సంవత్సరానికి పది బ్యాగ్‌లెస్ డేస్ ఉండాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ సంప్రదాయం విద్యా భారతిలో ప్రారంభం నుంచే ఉందని గుర్తుచేశారు. పిల్లలకు మొదటి దశలో మాతృభాషలోనే బోధన అందించడం వల్ల వారి ఆలోచనా సామర్థ్యం, సృజనాత్మకత పెరుగుతుందని ఆయన చెప్పారు. విద్యా భారతి పద్ధతిలో హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్ వంటి నాలుగు భాషలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దేశంలో పాఠాలను కేవలం కంఠస్థం చేయడం నుంచి సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన వైపు విద్యా విధానం మారుతోందని అన్నారు. ఈ మార్పు పుస్తకాల ద్వారానే కాకుండా ఆచరణలో అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యను కేవలం పాఠశాలలకే పరిమితం చేయకూడదని, కుటుంబం, సమాజం, స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు.
పుస్తకాలు సిద్ధం
ప్రస్తుతం విద్యా భారతి పరిధిలో సుమారు 33 నుంచి 35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, ఈ పరిధిని మరింత విస్తరించాలని ఆయన సూచించారు. విద్య, విలువలు, నైపుణ్యాలు, క్రీడలు, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై ఉచిత డిజిటల్ విద్యా కంటెంట్ రూపొందించాలని కోరారు. అదేవిధంగాఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన 1 నుంచి 8వ తరగతుల కొత్త పాఠ్యపుస్తకాలు సిద్ధమయ్యాయని, 9వ తరగతి పుస్తకాలు కూడా నెలరోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు కంప్యూటేషనల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంశాలను మొదటిసారిగా పాఠ్యాంశాల్లో చేర్చామని ఆయన వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యమని చెప్పారు. క్రీడలు, సంగీతం, నృత్యం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను కూడా ఎన్‌ఈపీ కింద విద్యా వ్యవస్థలో అధికారికంగా చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.
