Let's talk: editor@tmv.in
ఎనిమిదేళ్ల తర్వాత చైనాకు బ్రిటన్ ప్రధాని.. షీ జిన్‌పింగ్‌తో కీలక భేటీ

ఎనిమిదేళ్ల తర్వాత చైనాకు బ్రిటన్ ప్రధాని.. షీ జిన్‌పింగ్‌తో కీలక భేటీ

Shaik Mohammad Shaffee
30 జనవరి, 2026

ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న వేళ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తులైన బ్రిటన్, చైనాలు తమ సంబంధాలకు కొత్త జవజీవాలు పోశాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా, రెండో రోజైన గురువారం ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఒక బ్రిటిష్ ప్రధాని డ్రాగన్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి. గత కన్జర్వేటివ్ ప్రభుత్వాల హయాంలో దెబ్బతిన్న ద్వైపాక్షిక బంధాన్ని పునరుద్ధరిస్తూ.. ఆర్థిక వృద్ధి, భద్రతే లక్ష్యంగా పరిణతి చెందిన సంబంధాన్ని నిర్మించుకోవాలని నేతలు నిర్ణయించారు.

అరణ్య న్యాయం వద్దు.. బహుపాక్షిక వాదమే ముద్దు

బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో జరిగిన భేటీలో షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రాకతో మారనున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో, స్వేచ్ఛా వాణిజ్యం, బహుపాక్షిక వాదాన్ని ఇరు దేశాలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలను పెద్ద దేశాలు బాధ్యతగా గౌరవించకపోతే ప్రపంచం 'అరణ్య న్యాయం' వైపు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. గతంలో ద్వైపాక్షిక సంబంధాలు ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాయని, అవి ఎవరికీ మేలు చేయలేదని పేర్కొన్న ఆయన.. చరిత్రలో నిలిచిపోయే దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు చైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

సరిహద్దు భద్రతపై ఉక్కుపాదం

బ్రిటన్‌ను వేధిస్తున్న అక్రమ వలసల సమస్య పరిష్కారానికి ఈ పర్యటనలో కీలక పురోగతి లభించింది. ఇంగ్లీష్ ఛానల్ దాటే పడవల్లో 60 శాతం చైనా ఇంజిన్లే ఉంటున్నందున, ఆ సరఫరా గొలుసును తెంచేందుకు ఇరు దేశాలు 'సరిహద్దు భద్రతా ఒప్పందం' కుదుర్చుకున్నాయి.

స్మగ్లర్ల మార్గాలను గుర్తించేందుకు సమాచార మార్పిడితో పాటు, తయారీదారులతో నేరుగా చర్చించాలని నిర్ణయించారు. వందలాది మరణాలకు కారణమవుతున్న 'నిటజీన్స్' వంటి ప్రమాదకర సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తి, రవాణాను అరికట్టేందుకు ఉమ్మడిగా పోరాడాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

‘విస్కీ’ సుంకాల తగ్గింపు

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చేందుకు ప్రధాని స్టార్మర్ స్వయంగా 60 మంది అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో కలిసి ఈ పర్యటన చేపట్టారు. బ్రిటన్ నుంచి చైనాకు ఎగుమతయ్యే ప్రసిద్ధ 'స్కాచ్ విస్కీ'పై పన్నులు (సుంకాలు) తగ్గించేలా జరిగిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. దీనివల్ల బ్రిటన్ మద్యం వ్యాపారానికి చైనాలో పెద్ద మార్కెట్ దక్కనుంది.

బ్రిటిష్ పౌరులకు ‘వీసా’ ఊరట

వ్యాపారంతో పాటు పర్యాటకాన్ని పెంచేలా బ్రిటిష్ పౌరులకు చైనాలో 'వీసా మినహాయింపు' ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్టార్మర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని పెద్ద దేశాలతో కలిసి నడిచినప్పుడే దేశంలో సంపద, అభివృద్ధి సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.

ఫుట్‌బాల్ దౌత్యం.. షేక్‌స్పియర్ చర్చలు

దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో నేతలు రాజకీయాలతో పాటు వ్యక్తిగత అభిరుచులను పంచుకున్నారు. షీ జిన్‌పింగ్‌కు ఇష్టమైన 'మాంచెస్టర్ యునైటెడ్', స్టార్మర్ అభిమానించే 'ఆర్సెనల్' జట్ల మధ్య జరిగిన మ్యాచ్ బాల్‌ను ప్రధాని బహుమతిగా ఇచ్చారు. విందులో భాగంగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, షేక్‌స్పియర్ సాహిత్యంపై సరదాగా మాట్లాడుకున్నారు. అంతకుముందు స్టార్మర్ బీజింగ్‌లోని ఒక రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ.. చైనీస్ భాషలో ధన్యవాదాలు (షీ షీ) అని పలకడం స్థానిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివాదాలపై ‘గౌరవప్రద’ చర్చ

హాంకాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లై కేసు, మానవ హక్కులు, జాతీయ భద్రత వంటి వివాదాస్పద అంశాలపై స్టార్మర్ తన ఆందోళనలను షీ దృష్టికి తీసుకెళ్లారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చర్చల ద్వారానే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. గత 18 నెలల క్రితం తాను ఇచ్చిన హామీ మేరకు బ్రిటన్ తిరిగి ప్రపంచ వేదికపై తన గొంతుకను వినిపిస్తోందని స్టార్మర్ గర్వంగా ప్రకటించారు.