
ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ప్రాంగణంలో గల్ఫ్ సంక్షేమ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, ఇతర నేతలు, మహిళా కాంగ్రెస్ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగింటి సాంప్రదాయాన్ని, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కలిపిన ఈ కార్యక్రమం ఆత్మీయతను, మానవతా విలువలను ప్రతిబింబించింది.
మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు చాలా ప్రాముఖ్యత ఉందని బతుకమ్మ పండుగను 9 రోజులు ఘనంగా జరుపుకున్నారని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నా తెలుగు సోదరుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కట్టుబడి ఉందన్నారు. బతుకమ్మ లాంటి వేడుకల ద్వారా మాతృభూమి సంస్కృతిని గుర్తు చేస్తూ వారి కుటుంబాలకు ఓ మానసిక శాంతిని కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం అని చెప్పారు. వేదికపై మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలు పేర్చారు.
తెలంగాణ పాటలతో బతుకమ్మ ఆడుతూ పాడుతూ రంగుల ప్రపంచాన్ని తలపించారు. గల్ఫ్ వలసదారుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటర్నీ లబ్ధిదారులు తమ అనుభవాలు పంచుకున్నారు. ఎన్నారై సెల్ నాయకత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు, లీగల్ సపోర్ట్, హెల్ప్ డెస్క్ వివరాలను నిర్వాహకులు వివరించారు. అనంతరం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని తెలిపారు.
