
ఎన్టీఆర్ ‘భారతరత్న’ నెరవేరేదెప్పుడు ?
ఎన్టీఆర్ కు భారత రత్న తీసుకురావడానికి కృషి చేస్తానని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సినిమాల్లో, రాజకీయాల్లో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్ కు భారత రత్న డిమాండ్ దశాబ్ధాలుగా డిమాండ్ గానే ఎందుకు ఉందన్న ప్రశ్న ఉదయిస్తోంది. భారతరత్న అవార్డును అత్యున్నత స్థాయి పనితీరుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇస్తుంది. దేశంలోని చాలా మంది ప్రముఖులకు అత్యున్నత స్థాయిలో వారి పనితీరుకు గుర్తింపుగా ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం భారత రత్న అవార్డు అన్నది సుదీర్ఘ కాలం నుంచి డిమాండ్ గానే ఉంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపైన చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఎన్టీఆర్ కు భారత రత్న రావడం కష్టమైన పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి. తెలుగు రాజకీయాల్లో విశేషమైన కృషి చేశారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని చందద్రబాబు నాయుడు కోరితే కేంద్ర ప్రభుత్వం కాదనదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించవని చెబుతున్నారు.
ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తే ఎవరూ కూడా వ్యతిరేకించరని భావిస్తున్నారు. దీంతో పాటు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. టీడీపీ మద్దతుతోనే కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు కోరితే కాదనే పరిస్థితి ఉండదని చర్చిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా వ్యతిరేకించదని అంటున్నారు. పార్టీలకు, ప్రాంతాలకు, భాషకు అతీతంగా ఎన్టీఆర్ భారతరత్నను స్వాగతిస్తారని విశ్లేషిస్తున్నారు.
కానీ ఎన్టీఆర్ కు భారత రత్న డిమాండ్ ను డిమాండ్ గానే ఉంచే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తే ఎవరు అందుకోవాలి అన్న ప్రశ్న తెరమీదకు వస్తుంది. ఆయన సతీమణిగా లక్ష్మీపార్వతి ఆ అవార్డును అందుకోవాలి. కానీ అందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, నారా చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. ఈ కారణంతోనే ఎన్టీఆర్ కు భారత రత్న రావడంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకి తెచ్చి, ఆ తర్వాత ఆ డిమాండ్ ను పక్కన పడేస్తున్నారనే చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యుల ఏకాభిప్రాయం లేని నేపథ్యంలోనే ఎన్టీఆర్ భారత రత్న అంశం ఆలస్యం అవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కుటుంబ సమస్యలు పక్కనపెట్టి, ప్రత్యామ్నాయం ఆలోచించాలని విశ్లేషకులు పిలుపునిస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రయత్నలోపం, ఏకాభిప్రాయం లేకపోవడం ఫలితంగా ఎన్టీఆర్ భారతరత్న అంశం మరుగున పడుతోందని ఆరోపిస్తున్నారు. సినిమా నుంచి రాజకీయాల్లోకి, రాజకీయంలో విశేష కృషితో అన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించిన ఎన్టీఆర్ లాంటి వ్యక్తి విషయంలో ఇలాంటి రాజకీయాలు సరికాదని సూచిస్తున్నారు. చంద్రబాబు తలుచుకుంటే ఎన్టీఆర్ కు భారతరత్న పెద్ద విషయం కాదని, చిత్తశుద్ధి లోపమే స్ఫష్టంగా కనిపిస్తోందని భావిస్తున్నారు.
