
ఎట్టకేలకు దొరికిన పులి… ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు
గత వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసిన 'ఆపరేషన్ టైగర్' ఎట్టకేలకు సుఖాంతమైంది. కూర్మపురం గ్రామ పరిసరాల్లో హడలెత్తించిన మూడేళ్ల మగ పులిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం చాకచక్యంగా బంధించారు. వందల కిలోమీటర్ల ప్రయాణం, ఎనిమిది పశువుల బలి.. వెరసి జిల్లాను వణికించిన ఈ వన్యమృగన్ని చివరకు పశువుల కొట్టంలో చిక్కింది.
తడోబా నుంచి రాజమండ్రి దాకా..
ఈ పులి ప్రస్థానం విస్మయానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి బయలుదేరిన ఈ మృగం, తెలంగాణ మీదుగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిందని జిల్లా అటవీ అధికారి వి. ప్రభాకర్ రావు తెలిపారు. జనవరి 20న ఏలూరు జిల్లాలో తలదాచుకున్న పులి, జనవరి 31న తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి నుండి గోదావరి నది తీరం వెంబడి ఆగ్నేయ దిశగా కదులుతూ జనావాసాల్లోకి చొరబడింది.
వరుస దాడులు.. గ్రామస్తుల్లో వణుకు
శుక్రవారం తెల్లవారుజామున కూర్మాపురం సమీపంలో ఒక గేదెను వేటాడటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో సంచరించిన సమయంలో ఇది మొత్తం ఎనిమిది పశువులను హతమార్చింది. కాగా పులి గ్రామంలోని ఓ ఇంటిలోకి ప్రవేశించి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు, అటవీ సిబ్బంది ఇంటింటికీ సోదాలు నిర్వహించారు. పొలాలు, శివారు ప్రాంతాల్లో ఎవరూ తిరగవద్దని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో గ్రామంలో కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది.
మరోవైపు పులిని బంధించేందుకు అటవీ శాఖ భారీ బలగాలను రంగంలోకి దించింది. డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాలను ఉపయోగించి గాలింపు చేపట్టారు. అదేవిధంగా విశాఖపట్నం ఐజీజడ్పీ మహారాష్ట్రలోని పుణే నిపుణులు, విజయవాడ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పట్టుకునే సమయంలో పులి అత్యంత క్రూరంగా ప్రవర్తించడంతో నిపుణులు ట్రాంక్విలైజర్ గన్‌లతో మత్తుమందు ఇచ్చి దాన్ని అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ జూకు తరలింపు
బంధించిన పులిని తదుపరి పరిశీలన,పునరావాసం కోసం విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. జనావాసాలకు అతి దగ్గరగా మృగం సంచరించినందున, అత్యంత జాగ్రత్తతో ఈ ఆపరేషన్ పూర్తి చేశామని ప్రభాకర్ రావు తెలిపారు. పులి చిక్కడంతో తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
