Let's talk: editor@tmv.in
ఎట్టకేలకు ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ ఘన విజయం

ఎట్టకేలకు ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ ఘన విజయం

Pinjari Chand
28 డిసెంబర్, 2025

ఎన్నాళ్లో వేచిన విజయం.. ఇంగ్లాండ్ కు దక్కింది. ఆస్ట్రేలియా గడ్డపై 2013–14 యాషెస్ సిరీస్ నుంచి 18 టెస్టులు ఆడిన ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 16 టెస్టుల్లో ఓడిపోయి, రెండు టెస్టులను డ్రా గా ముగించింది. అయితే ఈ సీరిస్ లో ఆ నిరీక్షణకు తెరవేశారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరిగిన నాలుగో యాషెస్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లలో జరిగిన తొలి మూడు టెస్టుల్లో ఓడిపోయిన ఇంగ్లండ్, కేవలం 11 రోజుల్లోనే యాషెస్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించాల్సి వచ్చింది. అయితే మెల్‌బోర్న్ టెస్టులో మాత్రం ఇంగ్లండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. 129 ఏళ్ల యాషెస్ చరిత్రలో ఒకే సిరీస్‌లో రెండు-రోజుల టెస్టులు జరగడం ఇదే తొలిసారి.

175 పరుగుల లక్ష్యం… విజయంతో ముగింపు

రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, టీ విరామం తర్వాత ఇంకా 98 పరుగులు అవసరమైన దశలో 178/6 స్కోరుతో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో వేల సంఖ్యలో హాజరైన ఇంగ్లండ్ అభిమానులు ‘బార్మీ ఆర్మీ’అంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఇది మాకు కష్టమైన టూర్. కానీ మేం ఆడిన తీరు ధైర్యాన్ని చూపించింది. మేం సాహసంగా ఆడామని అన్నారు. అయితే, రెండు రోజుల్లో టెస్ట్ ముగియడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే, ఇది సరైనది కాదు. బాక్సింగ్ డే టెస్ట్ రెండు రోజుల్లో ముగియడం ఎవరికీ ఇష్టం ఉండదని స్టోక్స్ వ్యాఖ్యానించారు.

ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో కీలక పాత్ర

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి 10 ఓవర్లలోనే 70/2 స్కోరు చేయడం మ్యాచ్‌పై ఆధిపత్యాన్ని చూపించింది. బెన్ డకెట్ – 34, జాక్ క్రాలీ – 37, జాకబ్ బేతెల్ – 40 పరుగులు చేశారు. స్కాట్ బోలాండ్ కీలక వికెట్లు తీసినా, జేమీ స్మిత్, హ్యారీ బ్రుక్ చాకచక్యంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. జో రూట్ (15), స్టోక్స్ (2) త్వరగా ఔటైనా లక్ష్యంపై ప్రభావం చూపలేదు. టంగ్‌కు ఇంగ్లండ్ బౌలర్ జోష్ టంగ్ తొలి ఇన్నింగ్స్‌లో 5/45తో కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

స్టోక్స్ మాట్లాడుతూ నేను ఔటైనప్పుడు చివరి 10 పరుగులు చాలా దూరంగా అనిపించాయి. ఇలాంటి టూర్‌లో చివరకు గెలవడం చాలా ప్రత్యేకమైన అనుభూతి అని భావోద్వేగానికి లోనయ్యారు.

132 పరుగులకే కూలిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్

రెండో రోజు లంచ్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు కేవలం 132 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ (46) ఔటైన వెంటనే ఖవాజా (0), అలెక్స్ కేరీ (4) వికెట్లు వరుసగా పడిపోయాయి. ఇంగ్లండ్ టీంలో బెన్ స్టోక్స్–3/24, బ్రైడన్ కార్స్–4/34 కీలక వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియా స్పందన

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ ఇంగ్లండ్ చాలా వేగంగా మొదలుపెట్టింది. రెండు ఇన్నింగ్స్‌లలో 50 లేదా 60 పరుగులు ఎక్కువ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది అని అన్నారు.

పిచ్‌పై విమర్శలు

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్‌బర్గ్ మాట్లాడుతూ, తక్కువ రోజుల్లో టెస్టు మ్యాచ్ లు ముగియడం బిజినెస్ కు మంచిది కాదు. పిచ్ తయారీలో ఇకపై క్రికెట్ ఆస్ట్రేలియా మరింత పాత్ర పోషించవచ్చు అని తెలిపారు.

భారీగా ప్రేక్షకుల రాక

మ్యాచ్ రెండో రోజు ఎంసీజీలో 92,045 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇది ఆస్ట్రేలియా టెస్ట్ చరిత్రలో రెండో అతిపెద్ద సంఖ్య. మూడో రోజు కోసం ఇప్పటికే 90,000 టికెట్లు అమ్ముడయ్యాయి కానీ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఐదు, చివరి యాషెస్ టెస్ట్ జనవరి 4న సిడ్నీలో ప్రారంభం కానుంది. ఈ విజయం ఇంగ్లండ్‌కు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినా, యాషెస్ మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.

ఎట్టకేలకు ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ ఘన విజయం - Tholi Paluku