Let's talk: editor@tmv.in
ఎటెర్నెల్‌ సీఈఓ పదవికి దీపిందర్‌ గోయల్‌ రాజీనామా

ఎటెర్నెల్‌ సీఈఓ పదవికి దీపిందర్‌ గోయల్‌ రాజీనామా

Shaik Mohammad Shaffee
22 జనవరి, 2026

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాతృసంస్థ 'ఎటర్నల్ లిమిటెడ్' తన నాయకత్వంలో కీలక మార్పును ప్రకటించింది. గత 18 ఏళ్లుగా సంస్థను అగ్రపథాన నడిపిస్తున్న వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్, గ్రూప్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఫిబ్రవరి 1, 2026 నుంచి ఆయన వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని, ప్రస్తుతం బ్లింకిట్ సీఈఓగా ఉన్న అల్బిందర్ సింగ్ ధిండా నూతన గ్రూప్ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని సంస్థ వెల్లడించింది.

ఎందుకు తప్పుకుంటున్నారంటే..

తను తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గల కారణాలను దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో వివరించారు. "గత కొంతకాలంగా నా దృష్టి అధిక రిస్క్ ఉన్న సరికొత్త ప్రయోగాల వైపు మళ్లుతోంది. ఇలాంటి వినూత్న ఆలోచనలను పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ పరిధిలో అమలు చేయడం కష్టతరమని నేను భావిస్తున్నాను. అందుకే ఆ బాధ్యతల నుంచి వైదొలగి, కొత్త అన్వేషణలు చేయాలనుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు. అయితే సంస్థ దీర్ఘకాలిక వ్యూహాలు, సంస్కృతి, నైతిక విలువల విషయంలో తన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

అల్బిందర్ ధిండాకు పగ్గాలు

బ్లింకిట్ వ్యవస్థాపకుడైన అల్బిందర్ ధిండాను దీపిందర్ గోయల్ తన వారసుడిగా ఎంపిక చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఒకప్పుడు కష్టాల్లో ఉన్న బ్లింకిట్‌ను లాభాల బాటలోకి తీసుకురావడంలో అల్బిందర్ కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరుపై నమ్మకంతోనే గ్రూప్ మొత్తం బాధ్యతలను ఆయనకు అప్పగిస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఇకపై రోజువారీ కార్యకలాపాలు, వ్యాపార నిర్ణయాలన్నీ అల్బిందర్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఈ మార్పులో భాగంగా గోయల్ తన వద్ద ఉన్న షేర్ ఆప్షన్లను తిరిగి కంపెనీకే ఇచ్చేయడం విశేషం.

ఈ ప్రకటన వెలువడటానికి ముందు ఎటర్నల్ లిమిటెడ్ మూడో త్రైమాసిక (క్యూ3) ఫలితాలను విడుదల చేసింది. సంస్థ ఏకంగా 73 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 102 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రెవెన్యూ సైతం గత ఏడాదితో పోలిస్తే 202 శాతం పెరిగి రూ. 16,315 కోట్లకు చేరింది. ముఖ్యంగా క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ తన మొట్టమొదటి త్రైమాసిక లాభాన్ని నమోదు చేయడం పట్ల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఆర్డర్ల వృద్ధి వేగంగా పెరుగుతుండటమే ఈ ఫలితాలకు ప్రధాన కారణమని సంస్థ తెలిపింది.

సరికొత్త ప్రయాణం

2008లో ఒక చిన్న మెనూ లిస్టింగ్ వెబ్‌సైట్‌గా మొదలైన జొమాటో, నేడు రూ. 2.35 లక్షల కోట్ల విలువైన భారీ టెక్ సామ్రాజ్యంగా ఎదిగింది. దీపిందర్ గోయల్ వైదొలగడం అనేది ఒక ముగింపు కాదు, అది సంస్థను మరింత వృత్తిపరంగా ముందుకు తీసుకెళ్లేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో గోయల్ చేపట్టబోయే 'హై-రిస్క్' వెంచర్లు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.