Let's talk: editor@tmv.in
ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీహార్‌లో మళ్లీ నితీష్‌కే పట్టం

ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీహార్‌లో మళ్లీ నితీష్‌కే పట్టం

Pinjari Chand
12 నవంబర్, 2025

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మరోసారి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ లభించనున్నట్లు అంచనాలు వెల్లువెత్తాయి. ఈ సారి మహాఘట్బంధన్ ఆశలు నెరవేరకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి.

• పీపుల్ పల్స్ సర్వే ప్రకారం ఎన్డీయే 133–159 సీట్లు గెలుచుకోనుంది. మహాఘట్బంధన్ కు 75–101, జన సురాజ్ పార్టీకి 0–5, ఇతరులకు 2–8 సీట్లు దక్కవచ్చని అంచనా.

• దైనిక్ భాస్కర్ పోల్స్‌లో ఎన్డీయేకు 145–160, మహాఘట్బంధన్ కు 73–91, ఇతరులకు 5–10 సీట్లు వస్తాయని తెలిపింది..

• డీవీసీ రీసెర్చ్ అంచనాల ప్రకారం ఎన్డీయే 137–152, మహాఘట్బంధన్ 83–98, జన సురాజ్ 2–4, ఇతరులు 4–8 సీట్లు సాధించవచ్చని పేర్కోంది.

ఈసారి బీహార్‌లో రెండో దశ ఓటింగ్ 67.14శాతం నమోదైంది. కిషన్ గంజ్ జిల్లాలో అత్యధికంగా 76.26శాతం, కటిహార్‌లో 75.23, పూర్ణియాలో 73.79 శాతం ఓటింగ్ నమోదైంది. నవాడా జిల్లాలో కనిష్టంగా 57.11శాతం మాత్రమే నమోదైనట్టు ఎన్నికల సంఘం వివరాలు తెలిపాయి.మొదటి దశలో 65.08% పోలింగ్ నమోదైంది. మూడు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే వర్సెస్ మహాఘట్బంధన్ ప్రధాన పోరాటంగా నిలిచింది.

బీహార్‌లో 160 సీట్లు గెలుస్తాం: బీజేపీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీతో గెలుస్తుందని బీజేపీ నమ్మకం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఒకే వైపు గాలి వీస్తోందని, ప్రజల మద్దతు ఎన్డీయేకే ఉందని పార్టీ జాతీయ ప్రతినిధి సయ్యద్ షహ్‌నవాజ్ హుస్సేన్ స్పష్టం చేశారు. రెండు దశల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీయే భారీ ఆధిక్యంతో విజయం సాధించబోతోందని సూచించాయి. మహాఘట్బంధన్ రెండో స్థానంలో నిలవవచ్చని, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ ఈసారి తన ఖాతా తెరవడమే పెద్ద విశేషమని అంచనాలు చెబుతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో పక్కనపెడితే బీజేపీ–ఎన్డీయే కనీసం 160 సీట్లు గెలుస్తుంది. ఇది పూర్తిగా ఏకపక్ష ఎన్నిక. మహిళలు భారీగా బయటకు వచ్చి ఎన్డీయేకే ఓటేశారని హుస్సేన్ తెలిపారు.

ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు అంతర్గత విభేదాలతో కాలం గడిపాయి. కానీ మేం ప్రజల మధ్య కష్టపడ్డామని ఆయన అన్నారు. జన సురాజ్ పార్టీ గురించి మాట్లాడుతూ వారు సోషల్ మీడియాలోనే కనిపించారు, నేలమీద కాదు. ఒక సీటైనా గెలిస్తే అదే పెద్ద విషయం అవుతుంది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక రెండో దశతో పాటు మొత్తం రాష్ట్రంలో 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది బీహార్ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం. ఈ ఎన్నికలు రాష్ట్రం అత్యంత ఎక్కువ కాలం సీఎం‌గా ఉన్న నితీష్ కుమార్ నాయకత్వంపై జరిగిన ప్రజా రిఫరెండమ్‌లా మారాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బీహార్ ఫలితాల ముందు కాంగ్రెస్‌కు షాక్‌ – సీనియర్‌ నేత షకీల్‌ అహ్మద్‌ రాజీనామా

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.

ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీహార్‌లో మళ్లీ నితీష్‌కే పట్టం - Tholi Paluku