Let's talk: editor@tmv.in
ఎగ్జిట్‌ పోల్స్‌పై తేజస్వి యాదవ్ ఫైర్​

ఎగ్జిట్‌ పోల్స్‌పై తేజస్వి యాదవ్ ఫైర్​

Pinjari Chand
13 నవంబర్, 2025

బీహార్‌ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ముగిసిన కేవలం కొన్ని గంటలకే విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధిక్కరించారు. ఎన్డీయే గెలుస్తుందంటూ ఎగ్జిట్‌ పోల్స్ చెప్పడం పూర్తిగా తప్పుడు అంచనాలని ఆయన బుధవారం స్పందించారు. ఇవి శాస్త్రీయమైనవి కావు. ఎవరికీ సరైన సాంపిల్‌ సైజ్‌ తెలియదు. ఈ సర్వేలు కేవలం ప్రజల మనోభావాలను ప్రభావితం చేయడానికే, ఎన్నికల అధికారులపై మానసిక ఒత్తిడి తెచ్చేందుకే రూపొందించారని ఆయన ఆరోపించారు. మొదటి దశ పోలింగ్‌ నవంబర్‌ 6న, రెండో దశ నవంబర్‌ 11న ముగియగా, ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14న జరగనుంది.

మా పార్టీ సర్వేలు చెబుతున్నాయి. మేమే అధికారంలోకి వస్తామని. దీంతో బీజేపీ, ఎన్డీయే నేతలు చాలా నెర్వస్‌గా, ఆందోళనగా ఉన్నారు. ఓటింగ్‌ తీరు చూసి వారిలో భయం పట్టుకుంది. ప్రజలు పొడవాటి క్యూలలో నిలబడి సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు ఓట్లు వేశారు. కానీ అదే సమయంలో ఎగ్జిట్‌ పోల్స్ విడుదల చేశారు. ఇది ప్రజల్లో గందరగోళం సృష్టించడానికేనని తేజస్వి ఆరోపించారు. ఈసారి మాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ 1995 ఎన్నికల కంటే కూడా బలంగా ఉండనుంది. ఆ సమయంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జనతా దళం గుర్తుతో పోటీ చేశారు. ఇప్పుడైతే ప్రజలు మార్పు కోరుతున్నారు. 14న ఫలితాలు వస్తాయి, 18న ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్డీయే కుట్రలు చేస్తోంది

బీహార్‌లో ఓట్ల లెక్కింపును జాప్యం చేయడానికి ఎన్డీయే కుట్రలు చేస్తోందని ఆర్జేడీ నేత, మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆరోపించారు. నవంబర్‌ 14న లెక్కింపు జరగనుండగా, ఎన్డీయే ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఎన్డీయే ఓట్ల లెక్కింపును ఆలస్యం చేయడానికి యత్నిస్తుంది. జిల్లా కేంద్రాల వద్ద భయ వాతావరణం సృష్టిస్తుంది. ఎక్కడ బాంబు పేలినా పట్టించుకోరు, కానీ బీహార్ అంతటా సైనిక ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని ‘హత్య’ చేయడానికి ప్రయత్నిస్తారని తేజస్వి యాదవ్ పత్రికా సమావేశంలో మండిపడ్డారు. 2020 ఎన్నికల్లో కూడా ప్రజలు మార్పు కోరుకున్నప్పటికీ, ఎన్డీయే “ఫౌల్ ప్లే” ద్వారా గెలిచిందని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో కేవలం 12 వేల ఓట్ల తేడాతో వాళ్లు గెలిచారు. ఈ సారి మహాఘట్బంధన్ క్లీన్ స్వీప్ చేస్తుంది. ‘ఓటు చోరీ’ జరగనివ్వం. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అవసరమైతే త్యాగాలు కూడా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

నవంబర్‌ 6న మొదటి దశ, మంగళవారం రెండో దశ పోలింగ్‌ ముగిసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం, బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉందని అంచనా. మహాఘట్బంధన్‌ మెజార్టీ తక్కువ స్థానాలకే పరిమితమవుతుందని సర్వే సంస్థలు సూచించాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌పై తేజస్వి యాదవ్ ఫైర్​ - Tholi Paluku