Let's talk: editor@tmv.in
ఎక్సైజ్‌ కేసులో ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్‌ హాజరు

ఎక్సైజ్‌ కేసులో ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్‌ హాజరు

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

ఢిల్లీ ఎక్సైజ్‌ లిక్కర్‌‌ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఈ కేసు విచారణలో న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ తప్పుకోవాలని కోరుతూ అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇతరులు రిక్యూసల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు హాజరైన కేజ్రీవాల్‌ తన పిటిషన్‌పై తానే స్వయంగా వాదిస్తానని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆయన హాజరును నమోదు చేస్తూ, కేజ్రీవాల్‌ వ్యక్తిగతంగా హాజరైనట్లు పేర్కొంది. ఆయన దాఖలు చేసిన రిక్యూసల్‌ పిటిషన్‌ను రికార్డులో చేర్చాలని, అలాగే డిజిటల్‌గా కూడా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. సీబీఐ తమ సమాధానాన్ని రేపటిలోపు సమర్పించాలని కోర్టు సూచించింది. ఇతర పక్షాలు కూడా ఇలాంటి పిటిషన్‌లు దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చని తెలిపింది.

రిక్యూసల్ పిటిషన్‌ అంసబద్దమైంది

విచారణ సందర్భంగా సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌‌ మెహతా, కేజ్రీవాల్‌ దాఖలు చేసిన రిక్యూసల్‌ పిటిషన్‌ను ‘అసంబద్ధమైనది’ అని పేర్కొన్నారు. కొందరు సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడాన్నే వృత్తిగా చేసుకుంటారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ స్వయంగా వాదించాలనుకుంటే ముందుగా తన న్యాయవాదిని తప్పించాల్సి ఉంటుందని, కోర్టు నాటకీయతకు వేదిక కాదని కూడా అన్నారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్‌, హైకోర్టు విధివిధానాలకు అనుగుణంగానే పిటిషన్‌ దాఖలు చేశానని తెలిపారు. వ్యక్తిగతంగా హాజరయ్యే పక్షం ఈ-ఫైలింగ్‌ చేయలేకపోవడంతో పిటిషన్‌ను రికార్డులో చేర్చాలని కోరారు.

ఇక ఈ కేసులో కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా తదితరులకు విముక్తి కల్పించిన ట్రయల్‌ కోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. అదే అప్పీల్‌పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ముందు జరిగిన విచారణలో హైకోర్టు ప్రతివాదులకు సమాధానాలు సమర్పించేందుకు గడువు ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టులో కూడా సంబంధిత పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని కోర్టు గమనించింది. ఇదిలా ఉండగా కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేయాలన్న విజ్ఞప్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. కేసుల కేటాయింపు నియమావళి ప్రకారమే జరిగిందని, రిక్యూసల్‌ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది సంబంధిత న్యాయమూర్తేనని స్పష్టం చేశారు. ఈ కేసు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021–22లో జరిగిన అక్రమాల ఆరోపణలకు సంబంధించినది. దీనిపై సీబీఐతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలతో పాటు కేజ్రీవాల్‌, సిసోడియా పేర్లు కూడా నిందితులుగా ఉన్నాయి.