Let's talk: editor@tmv.in
ఎక్సైజ్ కేసులో కేజ్రీవాల్‌పై అభియోగాలు మోపేందుకు ఆధారాలు లేవు: న్యాయవాది

ఎక్సైజ్ కేసులో కేజ్రీవాల్‌పై అభియోగాలు మోపేందుకు ఆధారాలు లేవు: న్యాయవాది

Pinjari Chand
12 ఫిబ్రవరి, 2026

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహా నిందితులు బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో అభియోగాల రూపకల్పనపై తమ వాదనలు ముగించారు. కేజ్రీవాల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎన్. హరిహరన్, ఆయనపై అభియోగాలు మోపడానికి ఎలాంటి తగిన ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ వాదనలు విన్నారు. నిందితుల తరఫు న్యాయవాదులను తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ తరఫున ఏఎస్జీ డీపీ సింగ్ హాజరవ్వనున్నారు. సీబీఐ ప్రతి వాదనలు ఫిబ్రవరి 12న(గురువారం) వినిపించనుంది.

జనవరి 17న కూడా హరిహరన్ కోర్టులో మాట్లాడుతూ, కేజ్రీవాల్‌పై ఎలాంటి నేర నిరూపణ ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఆయనపై దాఖలైన ఛార్జ్‌షీట్ ‘కట్ అండ్ పేస్ట్’ విధానంలో తయారు చేసిందని, గత ఛార్జ్‌షీట్లలోని అంశాలనే పునరావృతం చేశారని వాదించారు. ముఖ్యమంత్రిగా తన అధికారిక విధులు నిర్వర్తించడమే తప్ప, సౌత్ లాబీ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఎలాంటి ఆధారం లేదని తెలిపారు.

మొదటి ఛార్జ్‌షీట్‌లోనూ, తదుపరి మూడు సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్లలోనూ కేజ్రీవాల్ పేరు లేదని, నాల్గవ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో మాత్రమే ఆయన పేరు చేర్చారని చెప్పారు. నాల్గవ ఛార్జ్‌షీట్ కూడా పూర్వపు ఆరోపణలనే మళ్లీ ప్యాకేజింగ్ చేసి దాఖలు చేశారని వాదించారు. అధికారిక విధులు నిర్వహించిన వ్యక్తిని ఇరికించాలనే ఉద్దేశంతోనే నాల్గవ ఛార్జ్‌షీట్ దాఖలైందని పేర్కొన్నారు. మరింత దర్యాప్తు చేయడానికి ఇచ్చిన అనుమతిపైనా హరిహరన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు అనుమతితో సేకరించే అదనపు ఆధారాలు నిందితుడి నేరాన్ని స్పష్టంగా నిరూపించేవిగా ఉండాలని అన్నారు.

ఈ సందర్భంగా కోర్టు, అప్రూవర్ గా మారిన రాఘవ్ మాగుంట (మునుపటి నిందితుడు) ఇచ్చిన ప్రకటనపై వివరాలు ఇవ్వాలని న్యాయవాదిని కోరింది. కేజ్రీవాల్ తరఫున డబ్బులు చెల్లించాలని మాగుంటను కోరినట్టు ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఈ కేసులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో సౌత్ లాబీ రూ.100 కోట్ల మేర చెల్లించిందని ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కె. కవిత, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్‌దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోర్నాట్ల, రాకేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్‌ప్రీత్ సింగ్ రాయత్, అరవింద్ కుమార్ సింగ్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథూర్, పి. శరత్ చంద్ర రెడ్డి తదితరులు సహా మొత్తం 23 మందిపై అభియోగ పత్రాలు దాఖలు చేసింది.