
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం
విధి నిర్వహణలో గంజాయి స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్‌కు ఎక్సైజ్ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్‌గా నియామక పత్రాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో అందజేశారు. ఫిబ్రవరి 1న సౌమ్య అంత్యక్రియల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ఆమె మరణించిన 23 రోజుల్లోపే పరిహారం ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేయడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ. కోటి చెక్కును అందజేశారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ఎక్సైజ్ సిబ్బంది రక్షణ కోసం వారికి ఆయుధాలు ఇచ్చే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రవణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నట్లయింది.
