
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన యువ ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య (25) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మరణించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఈ యువ కానిస్టేబుల్ మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది.
ఘటన నేపథ్యం
జనవరి 23న నిజామాబాద్ జిల్లా మాధవనగర్ సమీపంలో గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ బృందం వాహనాల తనిఖీ చేపట్టింది. ఈ క్రమంలో ఒక అనుమానాస్పద కారును ఆపేందుకు ప్రయత్నించగా, స్మగ్లర్లు తప్పించుకునే ప్రయత్నంలో కారును వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో కారు సౌమ్యపైకి దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోగా, పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే సౌమ్యను స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. మల్టీడిసిప్లినరీ స్పెషలిస్ట్ బృందం అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. జనవరి 31 రాత్రి 9:41 గంటలకు ఆమె మరణించినట్లు ప్రకటించాము అని నిమ్స్ వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రి, మంత్రుల సంతాపం
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం సౌమ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
రూ.కోటి ఎక్స్‌గ్రేషియా: మంత్రి జూపల్లి
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య భౌతికకాయానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ ఆస్పత్రిలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, సౌమ్య సర్వీస్ కాలం అంటే ఆమె రిటైర్మెంట్ వయస్సు వరకు వచ్చే పూర్తి వేతనాన్ని కుటుంబసభ్యులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో సౌమ్య చూపిన తెగువ, అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు.
ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు తమ సహచరిణి కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించి ఒక్క రోజు వేతనం విరాళంగా ఇవ్వడం అభినందనీయమని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాలపై మరింత కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అవసరమైతే ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇవ్వడంపై ప్రభుత్వ పరిశీలన కొనసాగుతోందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మంత్రి సీతక్క కూడా మృతురాలి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రాణాలు కోల్పోయిన సౌమ్య మృతి ఎక్సైజ్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. యువ కానిస్టేబుల్ సాహసాన్ని కొనియాడుతూ పలువురు ఉన్నతాధికారులు నివాళులర్పించారు.
