
‘ఎంసీసీ అంటే మోడీ కోడ్ ఆఫ్ క్యాంపెయినింగ్’: కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేసింది. 2014 తర్వాత ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అంటే ఇప్పుడు ‘మోడీ కోడ్ ఆఫ్ క్యాంపెయినింగ్’గా మారిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం 4 గంటలకు భారత ఎన్నికల సంఘం 2026 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుందని తెలిపారు. ఈ నిర్ణయానికి ముందే ‘జీ2’ నుంచి అనుమతి తీసుకుని ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ‘జీ2’ అనే పదాన్ని కాంగ్రెస్ తరచుగా నరేంద్రమోడీ, అమిత్‌షాలను విమర్శించేందుకు ఉపయోగిస్తుంది. వీరిద్దరూ గుజరాత్‌కు చెందిన నాయకులు కావడంతో కాంగ్రెస్ ఇలా వ్యాఖ్యానిస్తుంటుంది. మోడీ ఇప్పటికే ప్రారంభోత్సవాలు, ఫీతా కట్టింగ్‌లు, పథకాల ప్రారంభాలు పూర్తి చేసిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు అనుమతి ఇచ్చి ఉంటారని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా 2014 నుంచి అది ‘మోడీ కోడ్ ఆఫ్ క్యాంపెయినింగ్’గా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఈ ప్రచారం అపవాదాలు, దూషణలు, భయాందోళనలు కలిగించడం, అబద్ధాల ప్రచారం వంటి అంశాలతో నిండిపోతుందని ఆరోపించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన నియమాల సమాహారం. ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ఇది రూపొందించారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడం కూడా దీని లక్ష్యం.
ఎన్నికల కమిషన్ బీజేపీ విస్తరించిన శాఖలా మారింది: సంజయ్ రౌత్ విమర్శ
ఎన్నికల కమిషన్‌పై శివసేన(యూబీటీ)నేత సంజయ్‌రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ బీజేపీకి విస్తరించిన శాఖలా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ముంబైలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రౌత్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎన్నికల కమిషన్ నిర్వహించబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ బీజేపీ కార్యాలయంలో జరిగినా ఆశ్చర్యపడనని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. బహుశా బీజేపీ కార్యాలయంలోనే జరిగే అవకాశం ఉంది. ఇప్పటి ఎన్నికల కమిషన్ బీజేపీకి విస్తరించిన శాఖలా పనిచేస్తోంది. ఈ కమిషన్‌పై మాకు నమ్మకం లేదు. వీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారని రౌత్ అన్నారు.
