
ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు టీడీపీ షోకాజ్ నోటీసు
ఏలూరు లోక్‌సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ సేవించారనే ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధిష్టానం తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ వ్యవహారంపై ఐదు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఫార్మ్‌హౌస్‌లో సోదాలు.. 11 మంది అదుపులోకి
మార్చి 14వ తేదీ శనివారం రాత్రి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ ప్రాంతంలో గల మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫార్మ్‌హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి సహా మొత్తం 11 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో వీరంతా డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయిందని సమాచారం.
పార్టీ తీవ్ర ఆగ్రహం.. వివరణకు ఆదేశం
ఈ పరిణామాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందిస్తూ.. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో ఇలాంటి ఘటనలు సహించబోమని పేర్కొన్నారు. ఈ వివాదం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందని, అందుకే మహేష్ కుమార్ నుంచి వివరణ కోరినట్లు తెలిపారు. ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నేను నిర్దోషిని: ఎంపీ మహేష్ కుమార్
తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ తాను కేవలం డిన్నర్ ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లానని డ్రగ్స్ సేవించలేదని స్పష్టం చేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏలూరు ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయను. నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన తన మద్దతుదారులను కోరారు.
