
ఎంపీలో మధ్యాహ్న భోజనం సమయంలో చిన్నారుల పక్కనే మేకలు
చిన్నారులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా, అదే ఆహారాన్ని వారి పళ్లెంల నుంచే మేకలు తింటున్న దృశ్యాలు వీడియో రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లా ధీమర్‌ఖేడా తహసీల్ పరిధిలోని కోతి గ్రామం, సెహ్రా టోలా ప్రాంతంలో ఉన్న ఒక అంగన్‌వాడీ కేంద్రంలో జరిగింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గిరిజనులు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో ప్రభుత్వ భవనం లేకపోవడంతో, శిథిలావస్థలో ఉన్న ఒక ప్రైవేట్ భవనంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీడియోలో పిల్లల పక్కనే మేకలు ఆహారం తింటుండగా, అక్కడ అంగన్‌వాడీ కార్యకర్తలు గానీ, సహాయకులు గానీ కనిపించకపోవడం గమనార్హం.
ఈ ఘటనపై జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి హర్సిమ్రన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ, శుక్రవారమే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రోగ్రాం అధికారి వంశ్రీ కుర్వేటి మాట్లాడుతూ పర్యవేక్షకురాలు అనితా ప్రధాన్‌తో పాటు అంగన్‌వాడీ కార్యకర్త మీనా బైగాకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. రేపటిలోగా నివేదిక అందే అవకాశం ఉంది. తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల ప్లేట్లకు బదులుగా వ్యర్థ కాగితాలపై భోజనం
ఇదే ఏడాది నవంబర్ లో మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం అమలులో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని విజయ్‌పూర్ బ్లాక్ పరిధిలో ఉన్న హుల్ల్‌పూర్ గ్రామంలోని ఒక ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో, చిన్నారులకు ప్లేట్లకు బదులుగా వ్యర్థ కాగితాలపై భోజనం వడ్డించిన ఘటన సంచలనం సృష్టించింది.విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి పైకప్పు లేకుండా నేలపై కూర్చుని, చించిన కాగితాలపై వడ్డించిన అన్నాన్ని తింటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అప్పట్లో ఈ ఘటన పై షియోపూర్ జిల్లా కలెక్టర్ అర్పిత్ వర్మ స్పందించి
విచారణకు ఆదేశించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటన మరవముందే మళ్లీ ఈ దృశ్యాలు మధ్యాహ్న భోజన అమలులో నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాయి.
