
‘ఎంజీ నరేగా’ మార్పులపై కిసాన్ మజ్దూర్ మోర్చా ఆగ్రహం
2020లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో తీసుకొచ్చిన మూడు నల్లచట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమం చేసిన కిసాన్ మజ్దూర్ మోర్చా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా చట్టపరమైన మార్పులపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మార్పులు దేశవ్యాప్తంగా గ్రామీణ కార్మికులను ఉపాధి నుంచి దూరం చేయడానికే ఉద్దేశించినవని ఆరోపించింది. ఈ విధానాలకు నిరసనగా డిసెంబర్ 29న పంజాబ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని మోర్చా ప్రకటించింది.
ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీలు, డీడీపీవో (డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్ ఆఫీసర్) కార్యాలయాల అధికారాలను తొలగిస్తూ, పనుల అనుమతులు, కార్మికుల నియామకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తున్నారని మోర్చా ఆరోపించింది. దీనివల్ల స్థానిక స్వయంపాలన వ్యవస్థ పూర్తిగా బలహీనపడుతుందని పేర్కొంది.
40 శాతం నిధుల కోత – ఉపాధిపై తీవ్ర ప్రభావం
ఎంజీఎన్ఆర్ఈజీఏకు కేటాయించే నిధులను కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 శాతం వరకు తగ్గించిందని మోర్చా తెలిపింది. అంతేకాకుండా, ఈ పథకం కింద అనుమతించే పనుల విభాగాలను కూడా తగ్గిస్తున్నారని ఆరోపించింది.
పంజాబ్‌లోనే సుమారు 11–12 లక్షల జాబ్ కార్డులు ఉండగా, దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది కార్మికులు ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించింది. ఈ మార్పుల వల్ల కార్మికులను నిరుద్యోగులుగా మార్చి, కార్పొరేట్ సంస్థలకు చౌక కార్మికులను అందించాలనే ఉద్దేశం దాగి ఉందని విమర్శించింది.
డిమాండ్లు ఇవే
కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రధానంగా ఈ డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది
• ఎంజీఎన్ఆర్ఈజీఏను పాత రూపంలోనే పునరుద్ధరించాలి
• ఉపాధి హామీని ఏడాదికి 200 రోజులకు పెంచాలి
• రోజువారీ వేతనాన్ని రూ.700కు పెంచాలి
• కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి
కార్మికుల హక్కులు పూర్తిగా పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మోర్చా స్పష్టం చేసింది.
తమిళనాడులోనూ నిరసనలు
ఇదిలా ఉండగా, ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరు మార్పు అంశంపై తమిళనాడులోని చెన్నైలో డీఎంకే నేతృత్వంలోని కూటమి భారీ నిరసన చేపట్టింది. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)’ చట్టం ద్వారా మహాత్మా గాంధీ వారసత్వాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ద్రావిడ కజగం అధ్యక్షుడు కె. వీరమణి మాట్లాడుతూ గాంధీని చట్టాల ద్వారా తొలగించలేరు. ఆయన ఆలోచనలు, త్యాగాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి అని వ్యాఖ్యానించారు.
సంఘ్ పరివార్‌లో అంతర్గత విభేదాలున్నాయా?
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని వీరమణి ఆరోపించారు. ఇది నిశ్శబ్ద యుద్ధం. మాటల మధ్య దాగిన అర్థాన్ని చదవాలి అని అన్నారు.
విపక్ష నేతల విమర్శలు
వీసీకే నేత, ఎంపీ తోల్ తిరుమావళవన్ మాట్లాడుతూ గాంధీ పేరు ఉన్న ఈ పథకాన్ని తొలగించడం ద్వారా కేంద్రం దేశంలోని అతిపెద్ద సామాజిక సంక్షేమ పథకాన్ని బలహీనపరచాలని చూస్తోంది అని విమర్శించారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వ వైఖరికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
సవరించిన బిల్లు ముఖ్యాంశాలు
గ్రామీణ కుటుంబానికి హామీగా ఇచ్చే ఉపాధి రోజులు 100 నుంచి 125 రోజులకు పెంపు
నిధుల భాగస్వామ్యం: సాధారణ రాష్ట్రాలకు కేంద్రం–రాష్ట్రం 60:40
ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 90:10
వ్యవసాయ పీక్ సీజన్లలో (విత్తనం, కోత) ఏడాదికి 60 రోజుల వరకు పనుల నిలిపివేతకు రాష్ట్రాలకు వెసులుబాటు
