Let's talk: editor@tmv.in
ఎంజీనరేగాపై మోడీ ప్రభుత్వం బుల్డోజర్‌ నడిపింది: సోనియా గాంధీ

ఎంజీనరేగాపై మోడీ ప్రభుత్వం బుల్డోజర్‌ నడిపింది: సోనియా గాంధీ

Pinjari Chand
21 డిసెంబర్, 2025

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా)ను మోడీ ప్రభుత్వం బలహీనపరిచి, దాని స్థానంలో తీసుకొచ్చిన కొత్త నల్లచట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తిరస్కరిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఎంజీనరేగాను మోడీ ప్రభుత్వం పూర్తిగా బుల్డోజర్‌తో తొక్కేసిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ శనివారం ఆరోపించారు. దీనిని రద్దు చేస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం ఒక ‘బ్లాక్ లా’ అని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, లక్షలాది కార్యకర్తలు దీనికి వ్యతిరేకంగా పోరాడతారని ఆమె తెలిపారు.

వీడియో సందేశం ద్వారా గ్రామీణ ప్రజలనుద్దేశించి మాట్లాడిన సోనియా గాంధీ, ఎంజీనరేగాను బలహీనపరచడం ద్వారా మోడీ ప్రభుత్వం కోట్లాది రైతులు, కూలీలు, భూమిలేని పేదల హితాలను దెబ్బతీసిందన్నారు. 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్న సమయంలో, అన్ని పార్టీల సమ్మతితో ఎంజీనరేగా చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన రోజును తాను స్పష్టంగా గుర్తు చేసుకుంటున్నానని సోనియా గాంధీ తెలిపారు. అది ఒక విప్లవాత్మక చర్యగా మారి, అణగారిన వర్గాలు, పేదల జీవనాధారంగా నిలిచిందన్నారు.

ఉపాధి పథకం వల్ల వలసలు తగ్గాయి

ఎంజీనరేగా వల్ల ఉపాధి కోసం వలసలు తగ్గాయని, ఉపాధి హక్కు చట్టబద్ధంగా లభించిందని, గ్రామ పంచాయతీలకు అధికారాలు పెరిగాయని ఆమె చెప్పారు. మహాత్మా గాంధీ కలల గ్రామ స్వరాజ్యం దిశగా ఇది ఒక దృఢమైన అడుగని పేర్కొన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఎంజీనరేగాపై బుల్డోజర్‌ నడిపిందని, మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాకుండా, ఎలాంటి చర్చలు లేకుండా, ప్రతిపక్షాలను సంప్రదించకుండా చట్ట నిర్మాణాన్ని ఏకపక్షంగా మార్చిందని విమర్శించారు. కొత్త చట్టం ప్రకారం ఎవరికెంత పని ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనే నిర్ణయాలు ఢిల్లీలో కూర్చున్న ప్రభుత్వం తీసుకుంటుందని, ఇది గ్రామీణ వాస్తవాలకు పూర్తిగా సత్య దూరమని ఆమె ఆరోపించారు.

ఎంజీనరేగా అమలు, రూపకల్పనలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని, ఇది పార్టీకి సంబంధించిన పథకం కాదని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించినదని ఆమె చెప్పారు. ఈ చట్టాన్ని బలహీనపరచడం ద్వారా మోడీ ప్రభుత్వం గ్రామీణ భారతంపై దాడి చేసిందని అన్నారు. 20 ఏళ్ల క్రితం పేదల ఉపాధి హక్కు కోసం నేను పోరాడాను. ఈ రోజూ ఈ నల్లచట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా లాంటి కాంగ్రెస్ నాయకులంతా, లక్షలాది కార్యకర్తలు మీ వెంటే ఉంటారని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్తామని ప్రకటించింది.

ఇదిలా ఉండగా, పార్లమెంట్ గురువారం వీజీ-జీ రాం జీ బిల్లును ఆమోదించింది. ఇది 20 ఏళ్ల పాత ఎంజీనరేగా చట్టాన్ని భర్తీ చేయనుంది. ఈ బిల్లు ప్రతి ఏడాది 125 రోజుల గ్రామీణ ఉపాధిని హామీ ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే మహాత్మా గాంధీ పేరు తొలగించడం, ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై మోపడం పట్ల ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం పాత పథకంలోని లోపాలను సరిచేయడానికి ఈ బిల్లు అవసరమని సమర్థించారు.

ఎంజీనరేగాపై మోడీ ప్రభుత్వం బుల్డోజర్‌ నడిపింది: సోనియా గాంధీ - Tholi Paluku