
ఎంజీఎన్ఆర్ఈజీఏకు తెర.. వికసిత్ భారత్ ‘జీ-రామ్-జీ’ బిల్లుపై దుమారం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావాలనే ప్రభుత్వ బిల్లుపై సోమవారం తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జాతి పితామహుడు మహాత్మా గాంధీ పేరును ఈ పథకం నుంచి ఎందుకు తొలగిస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించారు.
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)(వీబీ- జీ రాం జీ) బిల్ – 2025 ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు అనుబంధ కార్యాచరణ జాబితాలో చేర్చారు. ఈ బిల్లు ద్వారా 2005లో అమల్లోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను రద్దు చేసి, వికసిత్ భారత్ 2047 జాతీయ దృక్పథానికి అనుగుణంగా గ్రామీణ అభివృద్ధి ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు పట్టించుకోలేదు: సప్తగిరి ఉలకా
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌పై పార్లమెంటరీ స్థాయి కమిటీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలకా మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకంలో పని దినాలు, వేతనాలు పెంచాలని కమిటీ ఎన్నో సిఫార్సులు చేసిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని మోడీ ఈ పథకాన్ని ‘గుంతలు తవ్వే పథకం’ అని విమర్శించారు. మొదటి నుంచే ఈ పథకాన్ని ముగించాలన్నదే వారి ఉద్దేశం అని ఉలకా అన్నారు.
బాపూజీ పేరుతో వారికి ఏం సమస్యో నాకు తెలియదు. ఇది కాంగ్రెస్ తెచ్చిన పథకం కాబట్టి ముగించాలనుకుంటున్నారా? కమిటీగా మేము 150 రోజులకు పెంచాలని, వేతనాలు పెంచాలని సిఫార్సు చేశాం. రాష్ట్రాలకు బకాయిలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు నిధులు ఇవ్వడం లేదు.
అయినా బిల్లు తీసుకొచ్చారు… కానీ మహాత్మా గాంధీ పేరు ఎందుకు తొలగించారు? అని ప్రశ్నించారు.
పేరు మార్చడం వల్ల లాభమేంటి? – ప్రియాంకా గాంధీ
పథకాల పేర్లు మారిస్తే, కార్యాలయాల్లో ఫైళ్లు, స్టేషనరీ, బోర్డులు అన్నీ మార్చాలి. దానికి భారీగా డబ్బు ఖర్చవుతుంది. దాంతో ప్రజలకు లాభమేంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అగ్రనేతగా గుర్తింపు పొందారు.
ఆయన పేరు తొలగించడం వెనుక ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని ఆమె వ్యాఖ్యానించారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మాట్లాడుతూ ప్రజల అసలైన సమస్యలపై చర్చించకుండా, ఇతర విషయాలపై సమయం, డబ్బు వృథా చేస్తున్నారు. వీళ్లే తమ పని తామే అడ్డుకుంటున్నారని వయనాడ్ ఎంపీ అన్నారు.
గాంధీకి అవమానం: డెరిక్ ఓబ్రియన్
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
ఇది మహాత్మా గాంధీకి చేసిన అవమానం. కానీ ఆశ్చర్యమేంటి? గాంధీని హత్య చేసిన వ్యక్తిని వీరు హీరోగా చూశారు. గాంధీని చరిత్ర నుంచి తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.
హక్కుల ఆధారిత వ్యవస్థను కూల్చే ప్రయత్నం: సీపీఐ(ఎం)
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ను పూర్తిగా మారుస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న హడావుడి,
వాస్తవానికి ఈ పథకంలోని హక్కుల ఆధారిత వ్యవస్థను కూల్చేస్తున్నారనే నిజాన్ని దాచడానికే అని ఆరోపించారు. కేంద్రం తన వాటాను గణనీయంగా తగ్గిస్తోంది. భారాన్ని రాష్ట్రాలపై నెట్టేస్తోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు తగ్గించి శిక్షించే అవకాశం దీనిలో ఉందని అన్నారు. సాంకేతిక జోక్యాలను చట్టబద్ధం చేసి, లక్షలాది మందిని వారి హక్కుల నుంచి దూరం చేస్తున్నారని విమర్శించారు. ఈ చర్యను నిర్లక్ష్యపూరితమైనదిగా పేర్కొంటూ ఇది గ్రామీణ దుస్థితిని మరింత పెంచుతుంది. పార్లమెంట్ లోపల, బయట ఈ ప్రమాదకర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతాం అని బేబీ స్పష్టం చేశారు.
వివాదం దురదృష్టకరం:శశిథరూర్
ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జీ-రాం- జీ బిల్లు నేపథ్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరు మార్పుపై చెలరేగిన వివాదం దురదృష్టకరం. గ్రామ్ స్వరాజ్యం, రామ రాజ్యం అన్న భావనలు పరస్పరం ఎప్పుడూ పోటీ పడిన శక్తులు కావు. అవి మహాత్మా గాంధీజీ చైతన్యానికి ఆధారమైన రెండు మూలస్తంభాలు. ఈ రెండింటినీ విభేదంగా చూపడం గాంధీజీ ఆలోచనా ప్రపంచాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడమే. గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామ స్థాయిలో స్వావలంబన, సమానత్వం, న్యాయం సాధించాలని గాంధీజీ కోరారు. అదే విలువలతో నిండిన నైతిక పాలననే ఆయన రామ రాజ్యంగా భావించారు. అది మతాధారిత రాజ్యం కాదు, మానవీయతతో నిండిన సమాజ క్రమం. గ్రామీణ పేదల జీవనాధారానికి సంబంధించిన పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఈ లోతైన సమన్వయాన్ని విస్మరించినట్లే. గాంధీజీ చివరి శ్వాస ‘రామ్’ అనే స్మరణతో విడిచిన విషయం ఈ రెండు ఆదర్శాల ఏకత్వానికి సాక్ష్యం. లేనిపోని విభేదాన్ని సృష్టించడం ద్వారా ఆయనను అవమానించకూడదు. గాంధీజీ చూపిన మార్గం విడగొట్టడానికీ కాదు, ఏకం చేయడానికే అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి
గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బిల్లు ఉద్దేశ్య వివరణలో మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఎంజీఎన్ఆర్ఈజీఏ గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ ఇచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన సామాజిక–ఆర్థిక మార్పుల నేపథ్యంలో ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
ఈ కొత్త చట్టం ప్రకారం
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికి — స్వచ్ఛందంగా నైపుణ్యం అవసరం లేని పనులు చేయడానికి ముందుకు వచ్చే పెద్దల కోసం
ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధిని చట్టబద్ధంగా హామీ ఇవ్వనుంది.
ఎంజీఎన్ఆర్ఈజీఏ బిల్లులో ముఖ్యాంశాలు
ఎంజీఎన్ఆర్ఈజీఏ(2005): గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 100 రోజుల ఉపాధి హామీ. 2009లో మహాత్మా గాంధీ పేరు చేర్చారు
కొత్త బిల్లు (2025):
• ఏడాదికి 125 రోజుల ఉపాధి హామీ.
• వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రూపకల్పన.
• కేంద్ర ప్రాయోజిత పథకం
• రాష్ట్రాలు 6 నెలల్లో తమ అమలు పథకాలు రూపొందించాలి
• కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు అయితే రాష్ట్రాలే భరించాలి
