Let's talk: editor@tmv.in
ఎంఐఎం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి: గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

ఎంఐఎం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి: గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

Gaddamidi Naveen
26 మార్చి, 2026

తెలంగాణ శాసనసభలో జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలాపన జరుగుతున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనను రాజ్యాంగం, జాతీయ గౌరవానికి అవమానంగా అభివర్ణించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు తీవ్రంగా ఖండించారు.

ఈ పరిణామంపై స్పందించిన బీజేపీ ప్రతినిధి బృందం, రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం సమర్పించింది. వందేమాతరం గీతాన్ని ఉద్దేశపూర్వకంగా బహిష్కరించి, సభ నుంచి నిష్క్రమించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా, వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లేదా కనీసం సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను విజ్ఞప్తి చేసింది.

చట్టసభ వంటి ప్రజాస్వామ్య వేదికలో ఇలాంటి ప్రవర్తన అంగీకారయోగ్యం కాదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఇది దేశభక్తి, మాతృభూమి పట్ల గౌరవాన్ని అవమానించే చర్యగా వారు అభివర్ణించారు. జాతీయ గౌరవాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, తుల్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, మూగ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

ఎంఐఎం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి: గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు - Tholi Paluku