
ఎంఎస్ఎంఈల స్థాపన వేగవంతం కావాలి: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
‘ ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, సెర్ప్, ఏపిఐఐసి, ఏపీఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థల సమన్వయంపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటును మరింత సులభతరం చేస్తూ, ప్రాజెక్టులు త్వరితగతిన పట్టాలెక్కేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి అధికారులను ఆదేశించారు.
అనుమతుల సరళీకరణ - ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సరళీకృతం చేయడం ద్వారా రాష్ట్రంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మెరుగుపరచాలని మంత్రి సూచించారు. ఎంఎస్ఎంఈ యూనిట్లు తక్కువ కాలంలోనే కార్యరూపంలోకి రావడానికి సంబంధిత శాఖలన్నీ స్పష్టమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన ఉన్నత స్థాయి సమీక్షలో కోరారు.
మహిళా సంఘాల నుంచి సూక్ష్మ పరిశ్రమల వైపు
స్వయం సహాయక సంఘాల ద్వారా సాగుతున్న ఆదాయ సృష్టి కార్యక్రమాలను సూక్ష్మ పరిశ్రమలుగా మార్చడమే ప్రభుత్వ ప్రాధాన్యతని మంత్రి తెలిపారు. ఇందుకోసం మహిళలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, మెంటరింగ్ అందించాలని, అలాగే లాభదాయకమైన పారిశ్రామిక అవకాశాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కేంద్ర, రాష్ట్ర పథకాల సమన్వయం:
ఎన్ఆర్ఎల్ఎం వంటి కేంద్ర పథకాలతో, రాష్ట్ర పథకాలను అనుసంధానం చేస్తూ ఎస్ హెచ్ జి ఆధారిత పరిశ్రమలను బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. కేవలం శిక్షణ మాత్రమే కాకుండా, ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి జాప్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఉత్పత్తుల డిమాండ్‌ను బట్టి అనుకూల ప్రాంతాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేయాలని ఏపిఐఐసిని మంత్రి కోరారు. ముఖ్యంగా జక్కంపూడిలోని ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లో ప్రాంగణాలను లీజు ప్రాతిపదికన స్వయం సహాయక సంఘాలకు కేటాయించి, వారు సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించాలని సెర్ప్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈఓ, ఏపిఐఐసి ఎండి, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈఓ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వ విభాగాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలని పునరుద్ఘాటించారు.
