Let's talk: editor@tmv.in
ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు మరింత మద్దతు ఇవ్వాలి : సీఎం

ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు మరింత మద్దతు ఇవ్వాలి : సీఎం

Panthagani Anusha
24 జనవరి, 2026

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో గణనీయమైన పురోగతి సాధించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పునర్వ్యవస్థీకరణకు అర్హమైన మొత్తం రూ.2 లక్షల కోట్ల రుణాలలో ఇప్పటివరకు దాదాపు రూ.50 వేల కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించామని దీని ద్వారా రాష్ట్రానికి రూ.1,108 కోట్ల మేర ఆదా లభించినట్లు ఆయన వెల్లడించారు.

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 233వ, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం రాష్ట్రానికి చేరుకున్న సీఎం నేరుగా సచివాలయానికి వెళ్లి సమావేశాల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ సమావేశాల్లో వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయ రుణాలు, ఎంఎస్ఎంఈల పురోగతి, ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

గత ప్రభుత్వ హయాంలో అధిక వడ్డీ రేట్లతో తీసుకున్న అప్పుల కారణంగా రాష్ట్రంపై అనవసర ఆర్థిక భారం పడిందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆ పరిస్థితిని సరిదిద్దేందుకు పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఉన్న రూ.2 లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వం గుర్తించిందని అందులో ఇప్పటికే రూ.49 వేల కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర క్రెడిట్ విశ్వసనీయత మెరుగుపడితే భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలు అందించినట్లు సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు రూ.1,490 కోట్ల వ్యవసాయ రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.95,714 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. ఉపాధి సృష్టిలో కీలకమైన ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు మరింత మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

వ్యాపార రంగంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున రుణాలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం పేదల పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తున్నదని పేర్కొంటూ బ్యాంకులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని ఇబ్బందులు పడొద్దని, వ్యవసాయం లేదా ఇతర అవసరాల కోసం బ్యాంకులను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు.

అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఇన్క్యుబేట్ అవుతున్న స్టార్టప్‌లకు బ్యాంకులు రుణ సహకారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు సమావేశంలో వెల్లడైంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అమరావతి హబ్ నుంచి వచ్చే స్టార్టప్‌లకు మద్దతు ఇస్తామని తెలిపారు. ఇతర బ్యాంకులు వివిధ ప్రాంతాల్లోని స్టార్టప్‌లకు సహకారం అందించనున్నట్లు పేర్కొన్నాయి. పునరుత్పాదక ఇంధన రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇదిలా ఉండగా రాజధాని అమరావతిని ఆర్థిక సంస్థల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సీఎం మరోసారి స్పష్టం చేశారు. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధిపై బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇప్పటికే 15 బ్యాంకు కార్యాలయాలకు పునాదులు వేసినట్లు పేర్కొంటూ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని బ్యాంకులను కోరారు.

ఈ ఎస్ఎల్బీసీ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ–ఎస్టీ కమిషన్ డైరెక్టర్ హాజరయ్యారు.