Let's talk: editor@tmv.in
ఎంఎస్‌ఎంఈలకు బడ్జెట్‌లో అనేక సౌకర్యాలు: నిర్మలా సీతారామన్

ఎంఎస్‌ఎంఈలకు బడ్జెట్‌లో అనేక సౌకర్యాలు: నిర్మలా సీతారామన్

Pinjari Chand
26 మార్చి, 2026

కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈస్‌) కోసం అనేక సౌకర్యాలు కల్పించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బలవంతం వల్ల కాకుండా స్పష్టత, నమ్మకంతో సంస్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. లోక్‌సభలో ఫైనాన్స్ బిల్ 2026పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సభ ఈ బిల్లును వాయిస్ ఓటుతో ఆమోదించింది. దేశ ఆర్థిక లోటు (ఫిస్కల్ డెఫిసిట్) 2021లో 9.3 శాతం నుంచి 2027 నాటికి 4.3 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఋణ-జీడీపీ నిష్పత్తి కూడా తగ్గుముఖం పట్టిందని మంత్రి తెలిపారు. ఫైనాన్స్ బిల్ 2026 ఐదు ప్రధాన సూత్రాలపై ఆధారపడిందని చెప్పారు.

• నమ్మకంపై ఆధారిత పన్ను విధానం

• ప్రజలకు సులభ జీవనం

• రైతులు, ఎంఎస్ఎంఈస్, సహకార రంగ బలోపేతం

• భారత్‌ను గ్లోబల్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి

• వాణిజ్య సౌలభ్యం, కస్టమ్స్ సంస్కరణలు

మధ్యతరగతికి ఉపశమనం

ప్రతిపక్షం చేసిన విమర్శలను ఖండిస్తూ, మధ్యతరగతి కోసం తీసుకున్న చర్యలను వివరించారు. విదేశీ విద్య, వైద్య ఖర్చులపై టీసీఎస్‌ తగ్గించామని, విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ 20 శాతం నుంచి 2శాతానికి , 17 ముఖ్య ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చామని, అలాగే వ్యక్తిగత వినియోగ మందుల దిగుమతులకు సౌలభ్యం కల్పించామన్నారు.

పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం

రీ-అసెస్‌మెంట్ ప్రారంభమైనా కూడా అప్‌డేటెడ్ ఐటీ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం

చిన్న పన్ను చెల్లింపుదారులకు విదేశీ ఆస్తుల వెల్లడిపై ప్రత్యేక పథకం

ఎయిర్‌పోర్ట్‌లలో కస్టమ్స్ వివాదాలు తగ్గించేందుకు నిబంధనల సరళీకరణ

ఎంఎస్ఎంఈస్‌‌కు ప్రోత్సాహం

ఎంఎస్ఎంఈస్‌కు ముందుగా సహకరించి, తర్వాత అమలు చేసే విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోందని మంత్రి చెప్పారు. లిక్విడిటీ పెంపు, అనవసర నిబంధనల తగ్గింపు ద్వారా వాటి వృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. జీఎస్టీ తగ్గింపులు ఫలితం ఇవ్వలేదన్న విమర్శలను ఖండిస్తూ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, జీఎస్టీ వసూళ్లు కూడా స్థిరంగా పెరుగుతున్నాయని వివరించారు. సెస్సులు రాజ్యాంగబద్ధమైనవేనని, వాటి ద్వారా వచ్చిన నిధులను రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో బదిలీ చేస్తున్నామని తెలిపారు. సేకరించిన మొత్తానికంటే ఎక్కువగా ఖర్చు చేసిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర పథకాలను అమలు చేయక ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. అస్సాంలో అమలవుతున్న టీ కార్మికుల పథకాన్ని బెంగాల్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.

ఎంఎస్‌ఎంఈలకు బడ్జెట్‌లో అనేక సౌకర్యాలు: నిర్మలా సీతారామన్ - Tholi Paluku