
ఊరికి పోగలమా మామా!
తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా వచ్చేసింది. సద్దుల బతుకమ్మ వేడుకలకు కూడా అంతా సన్నద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. నగరంలోని మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈసారి నగరంలో భారీ వర్షాల ప్రభావంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రశాంతంగా ఊరెళ్దామనుకున్న ప్రజలకు అడుగడుగునా చుక్కలు కనబడుతున్నాయి. ఒక వైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు వరద నీరు దాటుకుంటూ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరుకుంటే అక్కడ నెలకొన్న రద్దీతో ఊళ్లకు చేరుకోవడానికి జనం ఆపసోపాలు పడుతున్నారు.
నగరం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు ముఖ్యంగా జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లను ఆశ్రయిస్తారు. ఇప్పటికే పండుగ సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. వీటిలో అధిక చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ముందస్తు రిజర్వేషన్లు కూడా భారీగా ఉండటంతో ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో లేవు. దీంతో బస్సు రాగానే పదుల సంఖ్యలో ప్రయాణికులు సీటు కోసం పోటీ పడుతూ పరుగులు తీస్తున్నారు. మరోవైపు శనివారం భారీ వర్షాలతో ఎంజీబీఎస్‌లోకి వరద నీరు చేరుకుంది. దీంతో ఆర్టీసీ అధికారులు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు గమనించి వేరే ప్రదేశాల్లో బస్సులు ఎక్కాలని సూచించారు. ఈ విషయం తెలియని చాలామంది ప్రయాణికులు వరద నీటిలో ఆపసోపాలు పడుతూ ఎంజీబీఎస్‌కు చేరుకొని నిరాశగా వెనుదిరిగారు. ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో రాకపోకలు పునరుద్ధరించారు. అయినా ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక జేబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇదే అదునుగా ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున దండుకుంటున్నారు. సికింద్రాబాద్, కాచీగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తీవ్రంగా ఉంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ అధికంగా నడిచే కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, దిల్‌సుఖ్ నగర్, అమీర్‌పేట్ వద్ద ప్రయాణికులు భారీగా వచ్చి చేరుతున్నారు. వీటికి దాదాపుగా మందుగానే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
చదువులు, ఉద్యోగాలతో విసిగి వేసారిపోయిన యువత ప్రశాంతంగా కుటుంబంతో పండుగ చేసుకుందామని వెళ్తున్న సమయంలో నగరంలో పరిస్థితులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ వర్షాలు, వరదలు ప్రయాణానికి పెద్ద అడ్డంకిగా మారాయి. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ షరామామూలే. ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అదనపు బస్సులు కేటాయిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఊరెళ్లిపోతా మామా అంటూ సంతోషంగా బ్యాగులు సర్దుకున్న జనం, ఊరెళ్లగలమా రామా అంటూ నిట్టూరుస్తున్నారు!
