
ఉస్మానియాలో అట్టహాసంగా చారిత్రక ‘మహలఖా చందాబాయ్ ’ బావి పునః ప్రారంభం
ఉస్మానియా యూనివర్సిటీలో చారిత్రక ‘మహాలఖా చందాబాయ్’ మెట్లబావిని అట్టహాసంగా ప్రారంభించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ బావి నిజాం వారసత్వ కట్టడంగా పేరుగాంచింది. కాలక్రమీణ ఈ బావి దాని చారిత్రక వైభవాన్ని కోల్పోయి నిర్జీవంగా మారడంతో కళాశాలలో చదివే నజీర్ అనే విద్యార్ధి దీన్ని గుర్తించి యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకురాగా, ఇటీవల యూనివర్సిటీ వారు దీన్ని పునరుద్ధరించారు.
31 -1-2026 నా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరిచందన అతిధి గా రాగా, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ మూర్తి, కళాశాల అధ్యాపక బృందం, యూనివర్సిటీ పాలక బృందం, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ‘మహాలఖా చందాబాయ్’ మెట్ల బావిని పునః ప్రారంభించారు. మూర్త -మహేశ్వర పేరుతో షర్మిలా బిశ్వాస్ కళాకారుల బృందం నృత్య ప్రదర్శన చేయగా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అందమైన సాయంకాలం 6.15 నిమిషాలకు ఈ బావి పునః ప్రారంభం జరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
ఎవరీ ‘మహాలఖా చందాబాయ్’
తెలంగాణ చదువుల గుడి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర వెనక కనిపించని ఈమె హస్తం ఉందని ఎంతమందికి తెలుసు? ఒకప్పుడు మౌలాలీ, అధికమెట్ట (అడిక్‌మెట్) నేటి ఉస్మానియా యూనివర్శిటీ, సీఫెల్ నుండి బాగ్ లింగంపల్లి వరకూ ఈమె జాగీరులోని ఇలాఖాలే. చదువుల తల్లి ఉస్మానియా యూనివర్శిటీ, వివిధ విదేశ భాషలను అభ్యసించే ‘సీఫెల్’(ఇప్లూ), ఆంధ్ర మహిళా కళాశాలతో పాటు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొదలగు విద్యాకేంద్రాలన్నీ మహ లఖా చందా బాయ్ ఇచ్చిన స్థలాలే.
తొలి ఉర్దూ కవయిత్రి
నిజాం నవాబుల కాలంలో ప్రముఖ ఉర్దూ కవయిత్రి మహలఖా చందా బాయ్. ఆమెను ‘చందాబీబి’ అని కూడా పిలిచేవారు. భారతదేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రిగా ఆమెకు పేరుంది. ఆమె వంశీయులు గుజరాత్‌కు చెందినవారు. చందా బాయ్ , తల్లి రాజ్ కన్వర్ బాయి. ఆమె హిందువు. ఆమె అన్న నిజాం సైన్యంలో ఉన్నతాధికారిగా పని చేసేవాడు. నృత్యం ఆమెకు ఆరో ప్రాణం. ఆస్థాన నర్తకిగా వున్నా వివాహం చేసుకుంది. ఆమె భర్త తాజ్ అలీ షా. అలీషా విభిన్న రంగాలలో ప్రతిభాశాలి. చిత్రకారుడే కాదు, చరిత్రకారుడు కూడా. వారి ఏకైక సంతానమే మాహలఖా చందాబాయ్. తల్లి నుండి నృత్యాన్ని, అందాన్ని తండ్రి నుండి కళాత్మక హృదయాన్ని, చరిత్ర గ్రంథాల మీద మమకారాన్నే గాక మేన మామ నుండి ధైర్యాన్ని, వీరత్వాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకుంది.
మాహలఖా చందా బాయ్ జననమే ఒక వింత కథ. ఆమె తల్లి ఆర్నెల్ల గర్భవతిగా ఉన్నప్పుడు మౌలాలీ గుట్ట మీద ఉన్న ఒక సూఫీ సాధువు దర్గా సందర్శనకు వెళ్ళింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించి, భర్త తాజ్ అలీ షా ఒక్కడే పరిగెత్తి పైకి వెళ్ళి అక్కడి ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయింది.
తొమ్మిది నెలలు నిండిన తర్వాత క్రీ.శ. 1764 ఏప్రిల్ 4న ‘మాహలఖా చందాబాయ్’ జన్మించింది. ఆమె అసలు పేరు ‘చాందా బీబీ’. చిన్నతనం లోనే చందాబాయ్ ప్రతిభను గుర్తించిన అప్పటి నిజాం ప్రధాని అరిస్తు జాహ్ రెండవ నిజాంకు ఆమెను పరిచయం చేసారు. దీంతో రెండవ నిజాం ఆమెను నిజాం ప్రభుత్వంలో శాశ్వత రాజనర్తకిగా నియమించారు. అనతికాలంలోనే నిజాంకు నమ్మకస్తురాలైన సలహాదారుగా మారింది. ఆమె విశ్వసనీయతకు మెచ్చి నిజాం అపార భూములను మహాలఖా చందా బాయ్ కి కానుకగా ఇచ్చారు.
అందులో నేడు నగరంలో ఉన్న పురానా హవేలీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కార్యాలయ ప్రదేశాలు ఒకప్పటి మహాలఖా చందా బాయ్ ఎస్టేట్లే. అంతేకాదు, నిజాం ఆమెకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఆమె తన జీవితకాలంలో మౌలాలీ గుట్టపై ‘ఉర్సులను’ ప్రతి యేటా ఘనంగా జరిపించేది. గుట్ట కింద ఒక పెద్ద పూలతోటను నిర్మించింది. అందులో తన తల్లి సమాధిని నిర్మించింది.
చందా 1824 లో సుమారు 60 సంవత్సరాల వయస్సులో మరణించింది. మరణానంతరం మౌలాలీ కొండపైన ఆమె జ్ఞాపకార్థం నిర్మించిందే మక్‌బారా. ఆమె బతికున్న సమయంలో ఇక్కడ ముషాయిరా నిర్వహించేదట. అందుకే, ఇక్కడే ఆమె సమాధి నిర్మించారు.
చందాబాయ్ మెట్ల బావి ఉస్మానియా యూనివర్సిటీలోని ఇప్లూ వద్ద యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ( బిఈ డి) కాలేజీ లో ఉంది. చుట్టూ ఉండే భవనం మధ్యలో బావి ఆకారంలో ఉండడంతో దీనిని ‘మహా లఖాబావి’ అనేవారు. ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణ సమయంలోనే ఆమె జ్ఞాపకార్ధం దీనిని నిజాం కట్టించినట్లు చెబుతారు. దీనినే ఇప్పుడు పునరుద్దరించి పునః ప్రారంభించారు.
చందా’ అనే కలం పేరుతో దక్కనీ ఉర్దూలో ఆమె అనేక పద్యాలు, గజల్స్ చందాబాయ్ రాశారు. ఆమె స్వయంగా గజల్స్ రాసిపాడేది. చందా తఖల్లూస్‌తో (కలంపేరు) ఆనాటి దక్కన్‌లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ‘తవాయఫ్’ (కళావంతురాలు) ఆమె. ఇట్లా, తన ఆటపాటలతో నిజాం నవాబులను అలరించిన మహాలఖా బాయ్ చివరికి 1824లో తుదిశ్వాస విడిచింది. మహాలఖా చందాబాయ్ మరణం తర్వాత ఆమె రచనలు ‘ గుల్జారీ-ఇ-మహాలఖా’ పేరుతో అచ్చయినవి. ఆమె సమాధి ఇప్పటికీ నగరంలోని మౌలాలీలో ఉంది.
