
ఉసిరిచెట్టు కింద వనభోజనాలు: ప్రకృతి ఒడిలో ఒక ఆధ్యాత్మిక ఆనందం
చల్లని గాలులు వీచే నవంబర్ ఉదయాలు… ఆకుల మధ్య సూర్యరశ్మి తళతళలాడుతుంటే, గాలిలో పక్షుల కిలకిలారావాలు, మామిడితోటల్లో ఉసిరిచెట్టు నీడలో భజనల నాదం కలిసి ఒక పల్లె గీతంలా వినిపిస్తుంది. అదే కార్తీకమాసం అందం. ఈ పవిత్ర మాసంలో కుటుంబమంతా కలసి పచ్చని చెట్ల నీడలో భోజనం చేయడం “వనభోజనం” మన సంస్కృతిలో ఆనందాన్నీ, ఆధ్యాత్మికతనూ కలిపిన అద్భుత సంప్రదాయం.
కార్తీకమాసం అంటే కేవలం వ్రతాలు, దీపాలు మాత్రమే కాదు…ప్రకృతితో మనిషి మమేకమయ్యే అద్భుతమైన కాలం కూడా. ఈ కాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కలసి బయట వనంలో, చెట్ల నీడలో, ముఖ్యంగా ఉసిరిచెట్టుకింద వనభోజనం చేసే ఆచారం ఎంతో పాతది. ఆ పండుగ వంటకాలతోపాటు అందులో దాగిన ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక తత్త్వం మన సంప్రదాయ బలాన్ని తెలియజేస్తాయి.
ఉసిరిచెట్టుకింద భోజనం ఎందుకు?
ఉసిరి మనకు “ఆరోగ్యచెట్టుగా” పేరొందింది. ఆచారాల పరంగా చూసినా, వైద్యపరంగా చూసినా, ఉసిరి చెట్టు పవిత్రం. ఆ చెట్టు కింద భోజనం చేయడం అంటే ప్రకృతి ఇచ్చిన శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించడమే. ఒక చెట్టు తనంతట తానుగా కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుందో.. మానవాళి కూడా తమ పతన దశ నుంచి స్వతంత్రంగా ఎదగాలనే సంకేతాన్ని వనాలు ఇస్తాయి. అలాంటి వనాల్లో కార్తీక మాసంలో భోజనం చేయడం వల్ల వాటి నుంచి స్ఫూర్తి పొందినట్టవుతుందని పెద్దలు చెబుతుంటారు.వన భోజనం అంటే.. చెట్ల మధ్య కూర్చుని ఆహారాన్ని స్వీకరించడం. అందులోనూ ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల ఆయా చెట్ల మీదుగా వీచే గాలి.. మనస్సుకు ప్రశాంతతను, హాయిని కలిగించడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రత్యేకించి ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.
శాస్త్రీయ దృష్టిలో
ఉసిరి చెట్టు కింద వాతావరణం చల్లగా, తేమగా ఉంటుంది. దాని ఆక్సిజన్ ఉత్సర్గ ఎక్కువగా ఉండటంతో శరీరానికి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. చెట్టు చుట్టూ గాలి శుద్ధమవుతుండడం వల్ల బోజనం తర్వాత జీర్ణక్రియకు ఇది మేలు చేస్తుంది.
ఆధ్యాత్మిక దృష్టిలో
ఉసిరి చెట్టు విష్ణువు రూపంగా పూజించబడుతుంది. కార్తీకమాసంలో ఉసిరి పూజ, ఉసిరిచెట్టుకింద వనభోజనం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. భార్యాభర్తలు కలిసి భోజనం చేస్తే, బంధం బలపడుతుందని ఒక నమ్మకం ఉంది.
నేటి తరం: మారిన రూపాలు, మారని విలువలు
కార్తీకమాసం అనగానే గుర్తుకొచ్చేది దీపాల వెలుగు, వ్రతాలు, ఉసిరిచెట్టుకింద వనభోజనాలు.అయితే పూర్వం వనభోజనాలు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా మారిపోయాయో చూస్తే .. కాలం మారినా ఆ ఆచారంలో దాగిన ఆనందం, భక్తి, స్నేహం మాత్రం మారలేదు.
మన పెద్దలు వనభోజనాన్ని “ప్రకృతితో పండగ”గా చేసుకునేవారు.ఉసిరి, మర్రి, రావి చెట్ల నీడలో పల్లెలు మొత్తంగా చేరేవి. ఉదయం నుంచే కుటుంబమంతా కలసి ఉసిరి పూజ చేసేవారు. పల్లె పెద్దలు, పిల్లలు, యువత అంతా కలిసి ఒకే చోట భోజనం చేసేవారు. పెద్దలు భజనలు, హరిదాస కీర్తనలు పాడేవారు. పిల్లలు చెట్ల చుట్టూ ఆటలు ఆడేవారు. కుల,మతాలకు అతీతంగా ఊరంతా ఒకచోట చేరి సందడి చేసేవారు. అన్నపానీయాలు అందరూ పంచుకునేవారు.“విహారం, భోజనం, భక్తి” అన్నీ కలిసిపోయేవి.
ఆ రోజుల్లో వనభోజనం అంటే కేవలం భోజనం కాదు, అది కుటుంబ బంధాల పండగ. ఇప్పుడు కాలం వేగంగా మారిపోయింది. పట్టణ జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి, టెక్నాలజీ ప్రాభవం వల్ల వనభోజనాల రూపం కూడా కొత్తదైంది. పల్లెల్లో వనభోజనాల బదులు “పిక్నిక్‌లు”, “ఫ్యామిలీ అవుటింగ్స్” రూపంలో జరుగుతున్నాయి. పెద్ద చెట్ల నీడ కంటే రిసార్ట్‌లు, పార్కులు, ఫార్మ్‌హౌస్‌లు ప్రాధాన్యం పొందాయి. భజనల బదులు బ్లూటూత్ స్పీకర్లలో సంగీతం మొదలుపెట్టారు. పల్లెటూరి వంటల బదులు ఫాస్ట్ ఫుడ్, రెడీ టు ఈట్ ఐటమ్స్ తయారయ్యాయి. కానీ కుటుంబం కలసి ఒక రోజు బయట గడపడం, నవ్వుకోవడం, ఆనందించడం అన్న ఉద్దేశం మాత్రం అలాగే ఉంది. కాలం మారినా, ఉద్దేశం మాత్రం మారలేదు. పూర్వం వనభోజనం భక్తి, భక్తిపూర్వ ఆనందానికి ప్రతీక అయితే, ఇప్పుడు అది కుటుంబ సమైక్యతకు, మానసిక విశ్రాంతికి చిహ్నంగా మారింది. పూర్వం భక్తి ప్రధానంగా, ఇప్పుడు ఆనందం ప్రధానంగా, కానీ రెండింటిలోనూ స్నేహం, ఐక్యత, ఆరోగ్యం అనే మూల భావన ఒకటే.
వనభోజనానికి ముందుఉసిరి పూజ
ఉసిరిచెట్టుకింద భోజనం అంటే కేవలం ఆహారం కాదు, అది ఒక అనుభూతి. ప్రకృతి వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలసి చేసే భోజనం ఒక తాత్కాలిక యాత్రలాంటిది. ప్రకృతి ఒడిలో పిల్లలు ఆడుతూ, పెద్దలు భక్తి గీతాలు పాడుతూ చేసే ఆ వనభోజనం…
ఆహారం కంటే ఆ ఆనందమే తృప్తిని ఇస్తుంది. వనభోజనం ప్రారంభించే ముందు ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. దీనిలో దీపారాధన, హరిదాస కీర్తనలు, భజనలు ఉంటాయి. పురాణాల ప్రకారం, “ఉసిరి పూజ చేసే వారికి సర్వ పాప విమోచనం లభిస్తుంది” అని చెప్పబడింది. ఉసిరి కాయను తినడం, ఆ చెట్టును పూజించడం, దాని కింద కూర్చుని భోజనం చేయడం ఇవన్నీ ఒక పవిత్ర కార్యంగా భావిస్తుంటారు. ఉసిరి చెట్టుకు ఉన్న మరో పేరు ధాత్రి. లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన కార్తీకమాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహా విష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.
ఆధునిక కాలంలో పునరుజ్జీవం
ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఈ ఆచారాలు కొద్దిగా మరుగునపడ్డాయి. అయినా, ఇటీవల యువత ప్రకృతి వైపు తిరిగి చూస్తోంది. ఉసిరిచెట్టుకింద వనభోజనాలు ఇప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నంగా మారాయి. సోషల్ మీడియా ఫొటోలు, కుటుంబ గెట్టు టుగెదర్స్ రూపంలో ఈ పాత సంప్రదాయం మళ్లీ పునరుజ్జీవిస్తోంది.
ఉసిరిచెట్టుకింద వనభోజనం, అది కేవలం భోజనం కాదు, ఒక భావన. ప్రకృతిని, పంచభూతాలను సాక్షిగా చేసుకుని కుటుంబం కలసి భోజనం చేయడం అంటే ఆరోగ్యానికీ, ఆనందానికీ పునాది.
కార్తీకమాసం మనకు ఇచ్చే సందేశం ఇదే -ప్రకృతిని ప్రేమించు, పరంపరను కొనసాగించు.
ఉసిరి, ఆరోగ్యం, అందం, ఆచారాల సమ్మేళనం
కార్తీకమాసం వచ్చిందంటే ప్రకృతి కొత్త శ్వాస తీసుకుంటుంది. వృక్షాలు కాంతిమంతమై పచ్చని వస్త్రాలు ధరించగా, మన శరీరమూ ప్రకృతితో సమన్వయం కావాలనే సంకేతాన్ని ఇస్తుంది. ఈ కాలంలో మన పూర్వీకులు ఆచారాల రూపంలో ఆరోగ్య రహస్యాలను మనకు అందించారు. వాటిలో ఒకటి ఉసిరి తినడం. “కార్తీకంలో ఉసిరి తింటే వసంతం వరకూ వ్యాధి దరికి రాదు” అని పెద్దలు చెప్పిన మాటలో శాస్త్రం నిక్షిప్తమై ఉంది.
ఉసిరి – ప్రకృతి ప్రసాదించిన జీవనామృతం
ఉసిరి మన సంప్రదాయ వైద్యంలో ఆయురారోగ్యానికి మూలంగా భావించబడింది. ఈ పండు కార్తీకమాసంలో పుష్కలంగా లభిస్తుంది. చల్లని వాతావరణంలో శరీరానికి కావలసిన విటమిన్–Cను సరిపడా అందించే ఏకైక ఫలం ఇది.
రోగనిరోధక శక్తి పెంచుతుంది:
ఒక్క ఉసిరి పండు నిమ్మకాయ కంటే ఇరవై రెట్లు ఎక్కువ విటమిన్ సి ను అందిస్తుంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఉపవాసాలు, వ్రతాల కాలంలో ఉసిరి రసం తాగితే జీర్ణక్రియ సులభమవుతుంది, ఆమ్లత తగ్గుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉసిరి లివర్ శక్తిని పెంచి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. చర్మం కాంతివంతం అవుతుంది. డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది.. ఉసిరిలో ఉన్న క్రోమియం మూలకం ఇన్సులిన్ స్థాయిని సరిచేస్తుంది.
గుండెకు కవచం ల పని చేసి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తప్రసరణ సక్రమంగా ఉంచుతుంది.
ఉసిరి కేవలం ఔషధ ఫలం మాత్రమే కాదు, అందానికి సహజ మిత్రుడిలా ఉపయోగ పడుతుంది. ఉసిరి పొడి లేదా నూనె వాడితే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది, తెల్లబడకుండా కాపాడుతుంది. సహజ మెరుపు, బలం వస్తాయి. ఉసిరి రసం రోజూ తీసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. పింపుల్స్, మచ్చలు తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో కణజాలాలను రక్షించి వృద్ధాప్య ప్రభావాన్ని ఆలస్యం చేస్తుంది.
కార్తీకమాసంలో ఉసిరి ఎందుకు ప్రత్యేకం?
ఈ కాలంలో వాతావరణం చల్లబడుతుంది. శరీరంలో జలుబు, దగ్గు, శ్వాస సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉసిరి వాటికి సహజ కవచంలా పనిచేస్తుంది. అందుకే పాతకాలం నుంచి దేవాలయాలలో, ఆచారాలలో “ఉసిరి తోట పూజ” అనే సంప్రదాయం ఉంది. అది ఆరోగ్య సూత్రాన్ని ఆధ్యాత్మికంగా వివరించిన మార్గం. ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఉసిరి పండు లేదా రసం తాగడం ఉత్తమం.ఉసిరి పచ్చడి, మురబ్బా, చట్నీ రూపంలో తినొచ్చు. తేనెతో కలిపి తింటే శరీరానికి చల్లదనాన్ని, శక్తిని ఇస్తుంది.
కార్తీకమాసం అనేది శరీరం, మనసు, ఆత్మ ఈ మూడింటినీ శుభ్రం చేసుకునే సమయం. ఈ పవిత్ర కాలంలో ఉసిరి తినడం అంటే ప్రకృతితో మమేకమవ్వడమే. ఉసిరి తింటే వయసు తగ్గదు, ఆరోగ్యం పెరుగుతుంది. ప్రతి ఇంటి చల్లని ఉదయం ఒక ఉసిరి కాయతో ప్రారంభమైతే కార్తీకం అంతా కాంతివ౦తంగా, ఆరోగ్యంగా గడుస్తుంది.
