
ఉల్లి రైతుకు ఊరట దక్కేనా?
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం, రాళ్లదొడ్డికి చెందిన వెంకట్రాముడు రెండెకరాల్లో ఉల్లి వేశాడు. దాదాపు 60 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. సంతోషంతో ట్రాక్టర్కు ఎత్తి కర్నూల్ మార్కెట్ కు తరలిస్తే అక్కడ ఆయన పండిచిన పంటకు క్వింటాల్ ఉల్లికి వ్యాపారులు ఇచ్చిన ధర రూ.100. అంటే కేజీ 1 మాత్రమే. దీంతో చేసేదిమీ లేక అరవై క్వింటాళ్లను ఆరు వేలకు అమ్ముకుని, పంటి బిగువున బాధను భరిస్తూ ఇంటికి బయల్దేరాడు. ఇది కేవలం ఈయన పరిస్థితి మాత్రమే కాదు. ఉల్లి సాగు చేసి, మార్కెట్ కు తీసుకువచ్చిన ప్రతి రైతు పరిస్థితి కన్నీటి వ్యథే. దాదాపు కర్నూల్ జిల్లాలో 19,700 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగైంది. సరైన వర్షాలు కురవడం వల్ల దిగుబడి పెరిగింది. కర్నూల్ జిల్లాలోనే ఇన్ని ఎకరాల్లో సాగు చేస్తే అనంతపురం, కడప, చిత్తూరు, తదితర ఆంధ్రా ప్రాంతాల్లో దాదాపు 50వేల ఎకరాలకు పైగా సాగైంది. దీంతో మార్కెట్లో ధరలు పతనమయ్యాయి. ఇప్పటి వరకు అత్యధికంగా 20 రోజుల క్రితం రూ. 11 వందలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం క్వింటా ఉల్లి రూ.150కి పైగా పలుకుతోంది. ఇదిలా ఉంటే మార్కెట్ లో వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేయడానికి వెళితే సుమారు రూ. 20 నుంచి 30 పలుకుతోంది. పరిస్థితి ఎలా తయారైందంటే రైతుకు, వినియోగదారుడికి ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తుంది.
సమృద్ధిగా వర్షాలు
ఈ సారి జూన్ లోనే ఎక్కువగా రైతులు ఉల్లి సాగు చేశారు. దీంతో ఒకేసారి మార్కెట్ కు ఎక్కువ మొత్తంలో ఉల్లి మార్కెట్ కు తరలివచ్చింది. దీంతో వ్యాపారులు ధరలు ఆమాంతం తగ్గించేశారు. అలాగే ఉల్లిని ఎక్కువగా పండించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో కూడా ఉల్లి దిగుబడులు పెరగడంతో అక్కడి నుంచి మన ప్రాంతాలకు దిగుమతులు పెరిగాయి. తాడేపల్లి గూడెంలో అయా రాష్ట్రాల ఉల్లి గడ్డల రాకతో ధరలు అమాంతం పడిపోయాయి.
ప్రభుత్వ కనీస మద్దతు ధర
అధికంగా తరలివస్తున్న మార్కెట్ కు ఉల్లిని రైతులు తీసుకువస్తున్నారు. దీంతో మార్కెట్ లో ఉల్లికి సరైన ధర రాకపోవడంతో రైతులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం లో(ఎంఐఎస్) భాగంగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. దీని ప్రకారం కనీస మద్ధతు ధర క్వింటా ఉల్లి రూ.1200 లకు కొనుగోలు చేస్తోంది. అయితే ఇది కూడా ఆరంభంలోనే హంసపాదుగా మారింది. కొనుగోలు చేసిన ఉల్లిని బయటికి తరలించే చర్యలు చేపట్టకపోవడంతో ఎక్కడి నిల్వలు అక్కడే పేరుకుపోయాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు 5 వేల క్వింటాళ్లకు పైగా ఉల్లిని కొనుగోలు చేసింది. కానీ వాటిని తరలించే ప్రక్రియను ప్రారంభించలేదు. వాటిని తరలించాకే, మళ్లీ కొనుగోళ్లు చేపడుతుంది. దీంతో ఇటు వ్యాపారస్తులకు అమ్ముకోలేక, ప్రభుత్వం కొనక ఉల్లి మధ్యలోనే మురిగిపోతుంది. దీంతో రైతులు మరింత తీవ్రమైన నష్టాలు భరించాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిని వ్యాపారులకు అమ్ముదామనిపోతే వారు కొనడానికి ముందుకు రాలేదు. దీంతో అధికారులు క్వింటాల్ ఉల్లి రూ.50. కి అమ్మాల్సి వచ్చింది.
నిల్వ చేసే పరిస్థితి లేకపోవడం
అధికంగా ఉల్లి వచ్చినప్పుడు నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లిని భూమిలో నుంచి తీశామంటే ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అందునా ఈ సీజన్ లో వేసే ఉల్లి మరింత త్వరగా కుళ్లిపోతుంది. మిగతా పంటల మాదిరి ఉల్లిని నిల్వ చేసుకోవడానికి గిడ్డంగుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రైతులను ఆదుకుంటాం, వారి కోసం గిడ్డంగులను ఏర్పాటు చేస్తాం అని కబుర్లు చెప్పడమే కానీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యం.
కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేయడం
దేశంలో ఉల్లి ధరలు పెరిగి ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని ప్రభుత్వాలు పరిస్థితులను బట్టి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఎగుమతులకు అనుమతులను ఇస్తుంది. ఎక్కువగా మనదేశ ఉల్లిని ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్, నేపాల్, గల్ఫ్ దేశాలు దిగుమతి చేసుకుంటాయి. కానీ ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. బఫర్ స్టాక్ లో ఉల్లి నిల్వలను ఉంచుతుంది. కానీ బఫర్ లో ఇంకా గత సంవత్సరం నాటి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. నాఫెడ్ ( నేషనల్ ఆగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్), ఎన్సీసీఎఫ్(నేషనల్ కోఆపరేటివ్ కన్య్జూమర్స్ ఫెడరేషన్) వంటి సంస్థల ద్వారా బఫర్ స్టాక్ నిల్వల కోసం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.దీంతో ప్రస్తుతం రైతుల నుంచి సేకరించడానికి, ఎగుమతులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు.
రైతుకు ఎప్పుడు కష్టకాలమే. పంట పండితే ధర ఉండదు. ధర ఉంటే పంట రాదు. రెండు ఉంటే లాభం ఉండదు. ఏ పంట వేసినా రైతు పరిస్థితి ఇదే. ఉల్లి రైతు పరిస్థితయితే ఎప్పుడు అస్తవ్యస్తమే. ఎప్పుడో ఒకసారి జాక్ పాట్ తగిలినట్లు ధర ఉంటది. లేకుంటే ప్రతి సంవత్సరం గడ్డు కాలమే. ఈ సారీ ధర లేకపోవడంతో పండినపంటను పశువులకు మేతగా వేస్తున్నారు. చాలా మంది రైతులు పొలాల్లోనే దున్నేస్తున్నారు. ఆయా ప్రభుత్వాలు రైతులను తగిన రీతిలో ఆదుకున్నప్పుడే ఈ దేశ రైతు బాగుంటాడు. లేకుంటే దిగుబడి లేక, పెట్టిన పెట్టుబడి రాకుంటే ఉరి కొయ్యలపై విగతజీవిలా మారే ప్రమాదం ఉంది.
