
ఉర్దూ యూనివర్సిటీ భూములను తీసుకునే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు: మంత్రి అజారుద్దీన్
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదని మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తెలిపారు. యూనివర్సిటీ భూముల విషయంలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. మౌలానా భూములు యథాతథంగా ఉన్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చిచెప్పారు.
శుక్రవారం మీడియాతో మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూముల విషయంలో అనేక రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలంటే, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ భూములను తీసుకునే ఉద్దేశంతో లేదు. యూనివర్సిటీ భూములు సురక్షితంగానే ఉన్నాయని అన్నారు.
ఈ వివాదానికి కారణం జిల్లా పాలన నుంచి జారీ అయిన ఒక నోటీసేనని మంత్రి వివరించారు. ఆ నోటీసు భూముల స్వాధీనం కోసం కాదని, ఆడిట్ పరిశీలనల్లో వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో భూములను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచిస్తూ జారీ చేశారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆడిట్ వ్యాఖ్యల ఆధారంగా మాత్రమే నోటీసు ఇచ్చారు. భూములను మెరుగ్గా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే అది జారీ అయ్యిందని అజారుద్దీన్ పేర్కొన్నారు.
ఈ నోటీసు జారీ అయిన తర్వాత యూనివర్సిటీ రిజిస్ట్రార్ మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వివరించారని తెలిపారు. అందుకు స్పందించిన కలెక్టర్ ఆ నోటీసును ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ హామీని మీడియాకు కూడా తెలియజేశారని, దీనిపై అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదలైనట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుందన్న ప్రశ్నే లేదు. ఇది చాలా స్పష్టమైన విషయం అని ఆయన అన్నారు.
