
ఉయ్‌ఘుర్ల పై చైనా అణచివేత బహిర్గతం
ఉయ్‌ఘుర్ మైనారిటీలపై చైనా చేస్తున్నఅణచివేతను అంతర్జాతీయ వేదికలపై బహిర్గతం చేస్తూ ప్రపంచ ఉయ్‌ఘుర్ కాంగ్రెస్ ఈ వారం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. యూరప్ నుంచి ఆసియా వరకు పలు దేశాల్లో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు, అవగాహన సభలు, అవార్డు వేడుకలు ఉయ్‌ఘుర్ల స్వరాన్ని ప్రపంచ దృష్టికి తీసుకువచ్చాయి.
అంతర్జాతీయ వేదికలపై ఉయ్‌ఘుర్‌ల ప్రచారం
జర్మనీ మ్యూనిక్‌లోని చారిత్రక బ్లూటెన్‌బర్గ్ కోటలో కజాఖ్-ఉయ్‌ఘుర్ చిత్రకారుడు అహ్మత్ అఖాత్ "ఉయ్‌ఘుర్ ఆర్ట్ అండ్ కల్చరల్ ఎగ్జిబిషన్"ను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించారు. నుర్నిసా ఇస్మాయిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో సిల్క్ రోడ్ వారసత్వాన్ని ప్రతిబింబించే చిత్రాలు, సాంప్రదాయ ఉయ్‌ఘుర్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. జర్మన్ ప్రజలతో పాటు ఉయ్‌ఘుర్ వలసదారులు కూడా భారీగా హాజరయ్యారు. నవంబర్ 1న ఇస్తాంబుల్‌లో టర్కీ యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "ది అన్‌హెర్డ్ క్రైస్ ఆఫ్ ఈస్ట్ టర్కిస్తాన్" పేరుతో సమావేశం జరిగింది. జర్నలిస్టు హలిస్ ఒజ్డెమిర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చైనా చేస్తున్న ఉయ్‌ఘుర్ జాతి సంహారం, సాంస్కృతిక అణచివేతను తీవ్రంగా ఖండించారు. ఉయ్‌ఘుర్ ఉపాధ్యక్షుడు అబ్దురెషిట్ అబ్దుహమిత్ మాట్లాడుతూ టర్కీ ఎప్పటి నుంచీ ఈస్ట్ టర్కిస్తాన్ హక్కుల పట్ల సహకారం అందిస్తున్నదని గుర్తు చేశారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన "ఇంటర్నేషనల్ సివిల్ సొసైటీ వీక్ 2025"లో ఉయ్‌ఘుర్ అధ్యక్షుడు తుర్గుంజాన్ అలావ్డున్, మాజీ అధ్యక్షుడు డోల్కున్ ఇసా పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యం, హక్కులు, చేర్పు’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో దాదాపు వెయ్యిమంది ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు. చైనా తుర్కిస్తాన్‌లో కొనసాగిస్తున్న నిర్బంధ పాలనపై ఉయ్‌ఘుర్ ప్రతినిధులు స్పష్టమైన దృష్టి సారించారు.
చైనా డిజిటల్ గూఢచర్యం బహిర్గతం
జర్మన్ ప్రముఖ పత్రిక హాండెల్స్‌బ్లాట్ నవంబర్ 2న ఉయ్‌ఘుర్ నాయకురాలు జుమ్రతాయ్ ఆర్కిన్ వ్యాఖ్యలను ప్రచురించింది. చైనా అమలు చేస్తున్న ‘ఎథ్ నిక్ యూనిటీ లా’ ఉయ్‌ఘుర్ భాష, సంస్కృతిని ప్రమాదంలోకి నెడుతోందని ఆమె హెచ్చరించారు. అలాగే కెనడా అమెరికా ఉయ్‌ఘుర్ ఫోర్స్ డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ తరహా చట్టం తీసుకురావాలని కోరారు.
రుషాన్ అబ్బాస్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
నవంబర్ 5న అమెరికాలోని నేషనల్ ఎండోవ్‌మెంట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ‘2025 డెమోక్రసీ అవార్డు’ను ఉయ్‌ఘుర్ హక్కుల పోరాట నేత రుషాన్ అబ్బాస్‌కు అందించింది. ఆమె చైనా నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అదే రోజున జర్మనీలోని దచావ్ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌లో ఉయ్‌ఘుర్ నాయకులు హతమైన టర్కిక్ బాధితులకు నివాళి అర్పించారు. చైనా ప్రస్తుతం ఉయ్‌ఘుర్‌లపై చూపుతున్న క్రూరత్వాన్ని నాజీ అమానుషతతో పోలుస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ది గార్డియన్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం బ్రిటన్‌లోని షెఫీల్డ్ హల్లం యూనివర్శిటీ ఉయ్‌ఘుర్ బలవంతపు శ్రమపై జరుగుతున్న పరిశోధనను చైనా ఒత్తిడితో నిలిపివేసిందని తెలిసింది. దీనిపై అంతర్జాతీయ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ఉయ్‌ఘుర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఉద్యమం చైనా అణచివేతను అంతర్జాతీయ వేదికలపై వెలుగులోకి తెచ్చింది. కళ, సంస్కృతి నుంచి ప్రజాస్వామ్య వేదికల వరకు ఉయ్‌ఘుర్ ప్రతిఘటన గళం బలంగా మారింది. చైనా ప్రభావం ప్రపంచ విద్య, రాజకీయ రంగాల్లో ఎంత లోతుగా విస్తరిస్తోందో కూడా ఈ సంఘటనలు స్పష్టంచేశాయి.
ఉయ్‌ఘుర్లు అంటే ఎవరు?
ఉయ్‌ఘుర్లు అంటే టర్కిక్ మూలాలు ఉన్న ముస్లిం జాతి. చైనా వీరిని స్వతంత్రత, మతం, జాతి పేరుతో అణచివేస్తోంది. వారి పోరాటం ఇప్పుడు చైనా వ్యతిరేక అంతర్జాతీయ ఉద్యమంగా మారిపోయింది. వీరు ప్రధానంగా చైనాలోని ఉత్తర–పశ్చిమ భాగం శిన్‌జియాంగ్ లో నివసిస్తారు. చైనాలో వీరి సంఖ్య సుమారు 1.2 కోట్లకు పైగా ఉంటుంది. వీరి భాష, సంస్కృతి, మతం, దుస్తులు, ఆచారాలు అన్ని చైనా హాన్ జాతితో పూర్తి భిన్నంగా ఉంటాయి. చరిత్రపరంగా ఈ ప్రాంతం ‘ఈస్ట్ టర్కిస్తాన్’ పేరుతో స్వతంత్రంగా ఉండేది. కానీ 1949లో కమ్యూనిస్టు చైనా ఈ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకుంది. ఉయ్‌ఘుర్లలో కొంతమంది ‘ఈస్ట్ టర్కిస్తాన్’ స్వతంత్ర దేశంగా ఏర్పడాలని కోరుతున్నారు. దీనిని చైనా దేశ విభజన ప్రయత్నంగా పరిగణిస్తుంది. చైనా ఉయ్‌ఘుర్ల మతపరమైన చైతన్యాన్ని ఇస్లామిక్ రాడికలిజంతో కలిపి చూపిస్తోంది. 2009లో ఉరుమ్చీ నగరంలో జరిగిన ఉయ్‌ఘుర్–హాన్ హింసాత్మక ఘర్షణల్లో వందలాది మంది చనిపోవడంతో, బీజింగ్ మరింత కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. శిన్‌జియాంగ్ ప్రాంతం ముడిచమురు, గ్యాస్, బొగ్గు వంటి విలువైన సహజ వనరులతో నిండి ఉంది. ఇది చైనా ‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్ట్‌లో కీలక మార్గం. అందువల్ల చైనా ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాలని ఆశిస్తోంది.
చైనా చేస్తున్న దాష్టీకాలు
స్వతంత్ర అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేసింది. వాటిలో ఉయ్‌ఘుర్లను అణచివేస్తున్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
• సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల ఉయ్‌ఘుర్లు ‘పునర్ విద్యా శిబిరాలు’ పేరుతో బలవంతంగా నిర్బంధంలో ఉంచారు.
• మసీదులు, మతపరమైన కేంద్రాలు మూసివేశారు.
• ఖురాన్ చదవడం, ముస్లిం పేర్లు పెట్టడం, మతపరమైన దుస్తులు ధరించడం నిషేధం.
• మహిళలపై బలవంతపు గర్భనిరోధం, శారీరక హింస, లైంగిక దోపిడి వంటి ఆరోపణలు ఉన్నాయి.
• చైనా డిజిటల్ సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబాన్ని గమనిస్తోంది.
కానీ పలు మానవ హక్కుల సంస్థల అంచనా ప్రకారం 2017 నుంచి ఇప్పటివరకు 30,000 నుంచి లక్ష వరకు ఉయ్‌ఘుర్లు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా సుమారు 10 లక్షల మంది అదృశ్యమయ్యారు. నిర్బంధ శిబిరాల్లోనే ఉన్నారు. ఈ పరిస్థితిని పలు దేశాలు ‘జెనోసైడ్ (జాతి నిర్మూలన’ అని పిలుస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు కఠినంగా విమర్శిస్తున్నాయి.
