
ఉమీద్ పోర్టల్‌లో 5.17 లక్షల వక్ఫ్ ఆస్తుల నమోదు
భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల డిజిటల్ నమోదు కోసం ప్రారంభించిన ‘ఉమీద్’సెంట్రల్ పోర్టల్ పై పెట్టిన ఆరు నెలల గడువు డిసెంబర్ 6 అర్ధరాత్రితో ముగిసింది. ఈ గడువులో మొత్తం 5,17,040 వక్ఫ్ ఆస్తులు పోర్టల్‌లో నమోదయ్యాయి. అందులో 2,16,905 ఆస్తులు నియమిత అధికారులు ఆమోదించారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గడువు సమీపించే సమయానికి ఆస్తుల అప్‌లోడ్ వేగం గణనీయంగా పెరిగిందని, చివరి గంటల్లో భారీ సంఖ్యలో ఆస్తులు అప్‌లోడ్ అయ్యాయని సోమవారం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
• పోర్టల్ లో నమైదైన వక్ఫ్ ఆస్తులు: 5,17,040
• ఆమోదించినవి: 2,16,905
• పెండింగ్‌లో ఉన్నవి: 2,13,941
• తిరస్కరించినవి: 10,869
ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అనేక శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ఢిల్లీలో రెండు రోజుల మాస్టర్ ట్రైనర్ వర్క్‌షాప్, 7 జోనల్ సమావేశాలు, రాష్ట్రాలలో సీనియర్ బృందాల పర్యటనలు జరిగాయి. అలాగే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంద్రశేఖర్ కుమార్ 20కి పైగా సమీక్షా సమావేశాలు నిర్వహించి, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించారు.
రాష్ట్రాల వారీగా అత్యధికంగా పోర్టల్ లో నమోదు చేసిన వక్ఫ్ ఆస్తులు
ఉత్తరప్రదేశ్: 92,830 (సున్నీ 86,345 + షియా 6,485)
మహారాష్ట్ర: 62,939
కర్ణాటక: 58,328
పశ్చిమ బంగాల్: 23,086
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే ముతవల్లీల (ఆస్తుల సంరక్షకులు) ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని మరో మూడు నెలల పాటు ఎలాంటి జరిమానా లేదా కఠిన చర్యలు తీసుకోమని, మానవతా దృక్కోణంతో ఈ సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ దిశలో సుప్రీం కోర్టు ఆదేశాలు, వక్ఫ్ సవరణ చట్టం నిబంధనలు ఉన్నందున గడువు పొడిగించలేమని మంత్రి స్పష్టం చేశారు. అయితే వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారా మాత్రమే ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఉమీద్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యంలో పారదర్శకత, సమర్థత, డిజిటల్ ఏకీకరణ సాధ్యమవుతుందని, ఇది ముస్లిం సమాజం అభివృద్ధికి ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నమోదు చేసిన వక్ఫ్ ఆస్తుల వివరాలు
అందుబాటులో ఉన్న తాజా సమాచారం ఆధారంగా తెలంగాణలో మొత్తం వక్ఫ్ ఆస్తులు (అంచనా): సుమారు 51,000 (1955, 2001 సర్వేలు + ఇటీవలి 'వక్ఫ్ బై యూజర్' ఆస్తులు)
ఉమీద్ పోర్టల్‌పై నమోదు చేసిన ఆస్తులు: 46,352 (మేకర్ లెవల్‌లో ఎంటర్ చేసినవి). అందులో ఆమోదించినవి సుమారు 4,000, వెరిఫై చేసినవి 10,000, గెజిట్-నోటిఫైడ్ ఆస్తులు 33,500+ (ఇవి ప్రధానంగా రిజిస్టర్ అయ్యాయి).
గడువు చివరి దశలో టెక్నికల్ సమస్యలు, డాక్యుమెంట్ లోపాల వల్ల కొన్ని ఆస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో గడువు పొడిగించాలని పిటిషన్ దాఖలు చేసింది.
ఉమీద్ సెంట్రల్ పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ డిసెంబర్ 6 నాటికి నమోదు చేసిన ఆస్తులు: 11,290
మొదటి దశలో సబ్‌మిట్ చేసినవి: 11,008,చెకర్ స్థాయిలో సబ్‌మిట్ చేసినవి 30, అంతిమంగా ఆమోదించిన ఆస్తులు 61 మాత్రమే ఉన్నాయి. రిజెక్ట్ అయినవి 30, ఇంకా ఎక్కువ భాగం ఇంకా చెకర్/అప్రూవర్ స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కేవలం 61 వక్ఫ్ ఆస్తులు మాత్రమే పూర్తిగా ఆమోదించి రిజిస్టర్ అయ్యాయి. మిగిలిన 11 వేలకు పైగా ఆస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం వక్ఫ్ ఆస్తుల సంఖ్య 30 వేలకు పైగా ఉంటుందని అంచనా. అంటే గడువు ముగిసినా కేవలం 35–40 శాతం ఆస్తులు మాత్రమే పోర్టల్‌లో ప్రారంభమయ్యాయి, వాటిలోనూ అతి తక్కువ శాతం మాత్రమే పూర్తిగా ఆమోదం పొందాయి.
