Let's talk: editor@tmv.in
ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరణ

ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరణ

Pinjari Chand
6 జనవరి, 2026

దేశరాజధాని ఉత్తర–తూర్పు ఢిల్లీలో 2020లో అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలతో నమోదైన కేసులో కీలక నిందితులైన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఇదే కేసులో ఉన్న గల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ మంజూరు చేసింది.

న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లు ప్రాసిక్యూషన్ ఆరోపణలు, సాక్ష్యాల పరంగా ఇతర నిందితులకంటే భిన్నమైన స్థితిలో ఉన్నారని కోర్టు స్పష్టం చేసింది. వీరిద్దరి పాత్రలు ఆరోపిత నేరాల్లో తీవ్రస్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీరిద్దరూ ఐదేళ్లకు పైగా కాలంగా జైలులో ఉన్నప్పటికీ, ఆ నిర్బంధం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించదని, అలాగే యూఏపీఏ(ఉప)(అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) వంటి కఠిన చట్టాల్లో ఉన్న చట్టపరమైన పరిమితులను అధిగమించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

బెయిల్ విచారణలో వాదనలు

బెయిల్ కోరుతూ నిందితుల తరఫున న్యాయవాదులు ట్రయల్ ప్రారంభంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, ఐదేళ్లుగా జైలులో ఉన్నప్పటికీ హింసకు సంబంధించి ప్రత్యక్ష ఆధారాలు లేవని, ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వాదించారు. అయితే దీనికి ప్రతిగా ఢిల్లీ పోలీసులు ఇది యాదృచ్ఛికంగా జరిగిన అల్లర్లు కాదని, దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన పూర్వ ప్రణాళికతో కూడిన కుట్ర అని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, పాలనా మార్పుకు దారితీసే ప్రయత్నం జరిగిందని కోర్టుకు తెలిపింది. అలాగే అప్పటి అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటన సమయంలో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఈ అల్లర్లు కావాలనే ప్రణాళికతో నిర్వహించారని ఢిల్లీ పోలీసులు వాదించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశాన్ని ‘శాంతియుత నిరసన’ పేరుతో రాడికలైజేషన్‌కు ప్రేరకంగా ఉపయోగించారని కూడా ప్రాసిక్యూషన్ పేర్కొంది.

అల్లర్లలో నష్టం

ఈ కుట్ర ఫలితంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారని, వందల మందికి గాయాలయ్యాయని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిందని, ఢిల్లీలో మాత్రమే 753 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇదివరకే సెప్టెంబర్ 2, 2025న ఢిల్లీ హైకోర్టు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ సహా తొమ్మిది మంది నిందితులకు బెయిల్ నిరాకరించింది. వీరి ప్రసంగాలు విభేదాలను రెచ్చగొట్టేలా ఉండి, భారీ జనసమీకరణకు దారితీశాయని హైకోర్టు అభిప్రాయపడింది. సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో చెలరేగిన ఈ అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ కేసు ప్రస్తుతం కూడా న్యాయపరంగా, రాజకీయపరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాలో న్యూయర్క్ మేయర్ గా ప్రమాణం చేసిన జోహ్రన్ మమ్దానీ భారతదేశంలోని ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న వారి గురించి ముఖ్యంగా ఉమర్ గురించి ప్రత్యేక్ంగా లెటర్ రాయడంతో నేటి వారి కేసు విచారణలో బెయిల్‌ లభిస్తుందా? లేదా అన్న ఉత్కంఠ కోర్టు దగ్గర కనబడింది.

ఇప్పడు జైలే నా జీవితం: ఉమర్ ఖాలిద్

2020 ఉత్తర–తూర్పు ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో తనకు బెయిల్ నిరాకరించినప్పటికీ, ఇతర నిందితులకు బెయిల్ మంజూరు కావడం పట్ల తాను ఆనందంగా ఉన్నానని కార్యకర్త ఉమర్ ఖాలిద్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం తన భాగస్వామి బనోజ్యోత్స్న లాహిరితో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు యూఏపీఏ(అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద ప్రాథమికంగా కేసు ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ నిరాకరించింది.

తీర్పు అనంతరం జరిగిన సంభాషణను బనోజ్యోత్స్న లాహిరి ఎక్స్ (ట్విటర్)లో పంచుకున్నారు. ఆమె పోస్టులో ఇతరులకు బెయిల్ రావడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఉపశమనం కలిగిందని ఉమర్ చెప్పినట్లు పేర్కొన్నారు. దానికి ఆమె రేపు ములాఖాత్‌కు వస్తాను అని చెప్పగా, ఉమర్ స్పందిస్తూ సరే సరే… వచ్చేయి. ఇప్పుడు ఇదే నా జీవితం అని అన్నట్లు ఆమె తెలిపారు.

యూఏపీఏ సెక్షన్ 16

యూఏపీఏలోని సెక్షన్ 16 ప్రకారం ఉగ్రవాద చర్యల వల్ల ఎవరైనా మరణిస్తే, నిందితుడికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని, అదనంగా జరిమానా కూడా విధించవచ్చని చట్టం స్పష్టం చేస్తోంది.

మళ్లీ ఏడాది తర్వాత మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు: న్యాయవాది సరీం జావెద్

ఐదుగురు నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం వారి కుటుంబాలకు భారీ ఉపశమనం కలిగించిందని న్యాయవాది సరీం జావెద్ వ్యాఖ్యానించారు. గల్ఫిషా ఫాతిమా తరఫున వాదించిన జావెద్, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులో, బెయిల్ పొందిన ఐదుగురు నిందితుల విషయంలో వారి పాత్ర పరిమిత స్థాయిలోనే ఉన్నట్టు కనిపిస్తోందని కోర్టు గమనించిందని జావెద్ చెప్పారు. ఈ వ్యాఖ్యలే బెయిల్ మంజూరుకు కీలకంగా మారాయని ఆయన తెలిపారు. అదే సమయంలో బెయిల్ నిరాకరణకు గురైన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ లు ఒక సంవత్సరం తర్వాత మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని న్యాయవాది వెల్లడించారు.

వికసిత్ భారత్‌కు స్వాగతం అంటూ కేంద్రంపై ప్రియాంక్ ఖర్గే వ్యంగ్యం

2020 ఉత్తర–తూర్పు ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

సోమవారం ఎక్స్ లో పోస్టు చేసిన ప్రియాంక్ ఖర్గే ఇది వికసిత్ భారత్. ఇక్కడ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి బెయిల్ లభిస్తోంది, కానీ తమ గొంతెత్తిన వారికి మాత్రం బెయిల్ దక్కడం లేదంటూ విమర్శించారు. కుల్‌దీప్ సింగ్ సెంగార్, ఆశారాం బాపు, గుర్మీత్ రామ్ రహీం సింగ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వంటి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు బెయిల్ లభించిందని పేర్కొన్నారు. అదే సమయంలో ఉమర్ ఖాలిద్, సోనం వాంగ్‌చుక్, సాగర్ ఘోర్కే, రమేష్ గైచోర్ వంటి వారు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే జైలులో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌పై బీజేపీ ప్రతిదాడి

ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు కాంగ్రెస్ పార్టీతో పాటు దాని అనుబంధ వ్యవస్థల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా మద్దతు లేఖలు వచ్చాయని ఆయన ఆరోపించారు. బెయిల్ మాత్రమే తిరస్కరించలేదు, ఉగ్రవాదం, ఢిల్లీని దహనం చేసిన కుట్ర వంటి ఆరోపణలు ప్రాథమికంగా నిజమని సుప్రీంకోర్టు గమనించిందని పూనావాలా తెలిపారు. బీజేపీ మరో ప్రతినిధి ప్రదీప్ భండారి ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చెంపదెబ్బ అంటూ వ్యాఖ్యానించారు. టుక్డే–టుక్డే గ్యాంగ్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌కు ఈ తీర్పు గట్టి దెబ్బ అని అన్నారు.