Let's talk: editor@tmv.in
ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌లకు బెయిలొద్దు: ఢిల్లీ పోలీసులు

ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌లకు బెయిలొద్దు: ఢిల్లీ పోలీసులు

Pinjari Chand
31 అక్టోబర్, 2025

ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో 2020లో జరిగిన అల్లర్ల వెనుక ఉన్న పెద్ద కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.ఈ కేసులో నిందితులైన ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌ తదితరులకు బెయిల్‌ ఇవ్వకూడదని పోలీసులు సుప్రీంకోర్టులో వాదించారు. ఈ కేసు యూ.ఏ.పి.ఏ (ఉపా) చట్టం కింద నమోదైనట్లు గుర్తుచేసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పోలీసులు పేర్కొంటూ ఈ కుట్ర ముందస్తు ప్రణాళిక ప్రకారమే అమలు చేశారని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనకు వచ్చిన సమయంలోనే అల్లర్లకు పాల్పడేలా ప్రణాళికలు వేసుకున్నారని దీనిద్వారా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి, సీఏఏ అంశాన్ని ముస్లింలపై దాడిగా చూపించే ప్రయత్నం చేశారని వివరించారు.

శాంతియుత నిరసన పేరుతో కుట్రలు

నిందితులు శాంతియుత నిరసన పేరుతో వాస్తవానికి ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక ఫలితంగా 53 మంది మరణించారు.వందలమంది గాయపడ్డారని చెప్పారు.ఈ సంఘటనపై మొత్తం 753 ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కుట్రను అమలు చేయాలనే ప్రయత్నం జరిగినట్లు తెలిపారు. ఈ కుట్ర దేశ సమగ్రత, సార్వభౌమత్వం మీదే దాడి చేయడానికి పూనుకున్నారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి, ప్రజలను హింసకు ప్రేరేపించే ప్రయత్నం చేశారని పోలీసులు అఫిడవిట్‌లో పేర్కోన్నారు.అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి నిరసనలను ‘పాలనలో మార్పు తెచ్చేందుకు చేసే ఆపరేషన్’గా పిలుస్తారని, వాటి లక్ష్యం ప్రభుత్వ వ్యవస్థను అస్థిరం చేయడమే అని పేర్కొంది.

ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వొద్దు..జైలే

పోలీసులు ఈ కేసులో నిందితులకు బెయిల్‌ ఇవ్వరాదని స్పష్టం చేస్తూ భారతదేశ సమగ్రత మూలాలను దెబ్బతీసే ఇలాంటి నేరాలలో బెయిల్ కాదు, జైలు అనేది నియమం అని అఫిడవిట్‌లో తెలిపారు. నిందితులు విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని, కోర్టు ప్రక్రియలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కేసులో నిందితులైన ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌లతో పాటు గల్ఫిషా ఫాతిమా, మీరాన్‌ హైదర్‌, షిఫా ఉర్‌ రెహ్మాన్‌, అథర్‌ ఖాన్‌, అబ్దుల్‌ సైఫీ తదితరులు కూడా ఈ కుట్రలో భాగమని పోలీసులు పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరిలో సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనల్లో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లను పెద్ద కుట్రగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌లను యూ.ఏ.పి.ఏ చట్టం కింద అరెస్ట్‌ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఈ కేసులో నిందితులు దాదాపు ఐదేళ్లుగా జైలులో ఉన్నందున, వారి బెయిల్‌పై పునరాలోచన చేయమని ఢిల్లీ పోలీసులను అడిగింది. దీనికి ప్రతిస్పందనగా పోలీసులు ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.