
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘ప్రాజెక్ట్ హనుమాన్’
వన్యప్రాణి సంరక్షణా దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లో మానవ, వన్యప్రాణి ఘర్షణను నియంత్రించి ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణి సంరక్షణను సమన్వయంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘హనుమాన్ ప్రాజెక్ట్’ (హనుమాన్ - పర్యవేక్షణ, తక్షణ సహాయం, చికిత్స, సంరక్షణ అందించే ప్రత్యేక యూనిట్లు)’ను మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా ప్రారంభించారు. అడవులకు ఆనుకుని ఉన్న సరిహద్దు గ్రామాల్లో తరచూ ఎదురయ్యే సమస్యలకు శాస్త్రీయ, సాంకేతిక పరిష్కారాలు అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,‘ వసుధైక కుటుంబం’ అనే భారతీయ తత్వాన్ని ఆధారంగా తీసుకుని హనుమాన్ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు తెలిపారు. సమస్త జీవకోటి, వన్యప్రాణులు మన జీవన వ్యవస్థలో అంతర్భాగమని పేర్కొంటూ, మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణి సంరక్షణ అత్యంత కీలకమన్నారు. ఇటీవల కాలంలో వన్యప్రాణుల కారణంగా పంటలు, పశుసంపదకు నష్టం, ప్రజల భద్రతకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నూతన వ్యవస్థను ప్రవేశపెట్టామని చెప్పారు.
సరిహద్దు గ్రామాల రక్షణే లక్ష్యం, 100 జీపీఎస్ వాహనాలు
చిత్తూరు, పార్వతీపురం మన్యం వంటి జిల్లాల్లో ఏనుగులు, ఇతర వన్యప్రాణుల చలనం వల్ల పంట నష్టం, పశుసంపద నష్టం, ప్రాణాపాయం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, హనుమాన్ ప్రాజెక్ట్‌ను అత్యవసరంగా అమలు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో ముందస్తు హెచ్చరికలు, వేగవంతమైన స్పందన, బాధితులకు తక్షణ సహాయం అందించేలా ఈ వ్యవస్థను రూపకల్పన చేశామన్నారు.
హనుమాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా పూర్తి అధునాతన సాంకేతికతతో రూపొందించిన 100 ప్రత్యేక వాహనాలను పవన్ కళ్యాణ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 100 జీపీఎస్ అమర్చిన ప్రత్యేక వాహనాలు మోహరించారు. వీటిలో 93 రాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, 7 వన్యప్రాణి అంబులెన్సులు ఉన్నాయి. అడవుల్లో లేదా గ్రామాల సమీపంలో వన్యప్రాణుల కదలికలు గుర్తించిన వెంటనే ఈ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలను సురక్షితంగా తరలించడం, జంతువులను నియంత్రించడం వంటి చర్యలు చేపడతాయి.
నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ, ట్రీట్మెంట్ సెంటర్లు
వాహనాలకు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లిలో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు, అలాగే 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ అధికారి, జంతు వైద్య సిబ్బంది, గిరిజన సహాయకులు, పారా వెటరినరీ సిబ్బందితో కూడిన పూర్తి స్థాయి బృందం ఉంటుందని తెలిపారు.
గ్రామస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం అందించేలా వన్యజీవి రక్షక్ (వజ్ర) బృందాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నామన్నారు. పాములు, ఇతర జంతువుల వల్ల ఎదురయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీరికి శిక్షణతో పాటు రెస్క్యూ కిట్లు అందిస్తున్నామన్నారు.
పరిహారంలో భారీ పెంపు
వన్యప్రాణి దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఘటనల అనంతరం తక్షణ సహాయం అందించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 2,107 కేసులకు దాదాపు రూ.4 కోట్లు పరిహారంగా చెల్లించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
కుంకీ ఏనుగులతో విజయవంతమైన ఆపరేషన్లు
చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఇప్పటివరకు 8 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశామని పవన్ తెలిపారు. దీని ద్వారా ప్రజలకు, పంటలకు భద్రత కల్పించగలిగామని చెప్పారు.
ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ
హనుమాన్ ప్రాజెక్ట్‌లో కీలక భాగంగా కృత్రిమ మేధస్సు ఆధారిత ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ను అమలు చేయనున్నారు. ఏనుగులు తదితర వన్యప్రాణుల కదలికలను సెన్సర్లు, కెమెరాలు, డేటా విశ్లేషణ ద్వారా ముందుగానే గుర్తించి గ్రామస్థులకు అలర్ట్‌లు పంపే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. దీంతో ప్రమాదాల్ని ముందే నివారించే అవకాశం ఏర్పడనుంది.
ఈ సందర్భంగా హనుమాన్ డిజిటల్ యాప్, అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అంతకుముందు అటవీ శాఖలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన సిబ్బంది, సేవలందిస్తున్న ఎన్జీవోలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
హనుమాన్ ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. రెస్క్యూ వాహనాలు, అంబులెన్సులు, పులులు వంటి వన్యమృగాలను బంధించే బోన్లు, ఔషధ మొక్కలు, ఈస్ట్రన్ ఘాట్స్‌లో సంచరించే కింగ్ కోబ్రా తదితర పాములపై ప్రజంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వ సహకారం
కేంద్ర ప్రభుత్వం కూడా మానవ, వన్యప్రాణి ఘర్షణను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. 2023 డిసెంబరులో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వన్యప్రాణి దాడుల్లో మరణాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఈ అంశంపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, 2019 నుంచి 2023 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల దాడుల కారణంగా 21 మంది మృతి చెందారని అన్నారు. వీర౦దరికి పరిహారం ఇవ్వడం జరిగిందని పవన్ అన్నారు.
2022లో వన్యప్రాణి (రక్షణ) చట్టానికి చేసిన సవరణలతో పాటు, మానవ, వన్యప్రాణి ఘర్షణ నిర్వహణపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పంట నష్టం, సహాయక చర్యలు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాల్లో అవసరమైతే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కూడా సూచించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
‘హనుమాన్’ ప్రాజెక్ట్ ద్వారా ఘర్షణను కేవలం నియంత్రించడం కాకుండా, మానవులు, వన్యప్రాణులు బాధ్యతాయుతంగా సహజీవనం చేసే విధానంను ఏర్పాటుచేయడమే తుదిలక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మానవ, వన్యప్రాణి సంఘర్షణలను సమర్థవంతంగా తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఘనంగా ప్రారంభించిన “ప్రాజెక్ట్ హనుమాన్” రాష్ట్రాన్ని వన్యప్రాణి నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలబెడుతుందని అన్నారు. వన్యప్రాణి సంరక్షణా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభం కావడం శుభసూచకమని పేర్కొన్న ఆయన, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అటవీ శాఖ శాస్త్రీయ, సాంకేతిక ఆధారిత వినూత్న కార్యక్రమాలకు వేదికవుతుందన్నారు. ఏనుగుల వల్ల కలిగే నష్టాల నివారణకు కుంకీ ఆపరేషన్లు, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం సంరక్షణ, అటవీ పరిశోధన సంస్థల కార్యకలాపాల ద్వారా అటవీ శాఖ ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. పంటలు, ఆస్తులు, ప్రజల ప్రాణాలను రక్షించడంతో పాటు వన్యప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ద్వంద్వ లక్ష్యంతో “హనుమాన్” ముందుకు సాగుతోందని, దీనికి అటవీ శాఖతో పాటు వ్యవసాయం, పశుసంవర్ధక, పర్యాటక తదితర శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. వన్యప్రాణి సంరక్షణ, ప్రజల భద్రత, శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర పరిపాలన అనే నాలుగు స్తంభాలపై నిలిచిన ఈ కార్యక్రమం మానవులు, వన్యప్రాణులు సహజీవనం చేసే భావనను బలపరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
