
ఉప ఎన్నికలకు కేటీఆర్ సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రభుత్వంపై అవినీతి, బంధుప్రీతి, నియంతృత్వ ధోరణులపై ఆరోపణలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ముఖ్యమంత్రి బంధువుల కోసం మార్చి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయన పాలనను "నియంతృత్వం"గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందన్నారు. "గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా సమావేశం పెట్టుకోవడానికి కూడా అనుమతి లేని దుస్థితి తెలంగాణలో ఉందన్నారు. ఇది ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ట్రిపుల్ ఆర్ రూపంలో భారీ స్కాం
రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ను కేవలం సీఎం రేవంత్ రెడ్డి బంధువులకు లబ్ధి చేకూర్చేందుకే మార్చేశారని, అసలు ప్రణాళికను పక్కనపెట్టి వారి భూములు ఉన్న ప్రాంతం మీదుగా రోడ్డు వెళ్లేలా డిజైన్ మార్చడం ద్వారా వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు త్వరలోనే బయటపెడతా నని కేటీఆర్ సవాలు విసిరారు.
ఉప ఎన్నికలు పెట్టండి
ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. తనపై ఉన్న కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్ట కొడుతున్నారని, చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితిని "కుడితిలో పడిన ఎలుకలు"గా వర్ణించారు. వారి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని ఎద్దేవా చేశారు. "మీ పాలన అద్భుతంగా ఉందని భావిస్తే, దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో వెంటనే ఉప ఎన్నికలు పెట్టండి. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో తేలిపోతుంది," అని సవాల్ విసిరారు.
సార్ వస్తారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ గురించి మాట్లాడుతూ సరైన సమయంలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. ఎప్పుడు రావాలో, ఎలా రావాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన రాకతో రాజకీయ సమీకరణాలు తారుమారవుతాయి అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్-బీజేపీ బంధం
కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడం వెనుక కాంగ్రెస్, బీజేపీల మధ్య రహస్య అవగాహన ఉందని కేటీఆర్ ఆరోపించారు. మంత్రులకు కూడా తెలియకుండా సీఎం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది వారి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వంలో బంధుప్రీతి లేదంటున్నారని, మరి సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డిలకు వందల కోట్ల కాంట్రాక్టులు ఎలా దక్కాయని ఆయన ప్రశ్నించారు.
