
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎంవోయూ
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తీర రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ-మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. రూ.323 కోట్ల అంచనా వ్యయంతో ఈ తీర రక్షణ గోడను నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధుల ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) నోడల్ ఏజెన్సీగా, ఏపీ మారిటైమ్ బోర్డు నిర్మాణ పనుల అమలు సంస్థగా వ్యవహరించనుంది.
సముద్ర కోతపై శాస్త్రీయ అధ్యయనం
ఐఐటీ-మద్రాస్ నిపుణులు ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నారు. వాటి ఆధారంగా తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలు, నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయడంతోపాటు సాంకేతిక పర్యవేక్షణ చేపట్టనున్నారు.
నవంబర్ నుంచి పనులు
ఎంవోయూ ప్రక్రియ పూర్తవడంతో నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాలను సముద్ర కోత నుంచి రక్షించేందుకు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ-మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎ. సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖతీబ్ కౌసర్ బానో, ఏపీ మారిటైమ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ జి.వి. రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
